వనపర్తి: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడతామని.. మెరుగైన వసతులు కల్పిస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. వనపర్తిలో ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సభలో కేసీఆర్ మాట్లాడారు. ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమాన్ని వనపర్తి నుంచి ప్రారంభించడం ఈ జిల్లాకు దక్కిన గౌరవమన్నారు. తామంతా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివి పైకి వచ్చామని చెప్పారు. ఈరోజు మీముందు ఇలా నిలచున్నామంటే ప్రభుత్వ పాఠశాలల్లో తమ గురువులు చెప్పిన విద్యే కారణమన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య అందించాలనేది తమ లక్ష్యమని తెలిపారు. అనంతరం వనపర్తి జిల్లా కలెక్టరేట్ సమీకృత భవన సముదాయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. సాయంత్రం ప్రభుత్వ వైద్య కళాశాల భవనాన్ని ప్రారంభించిన అనంతరం అక్కడి మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో సీఎం పాల్గొని ప్రసంగిస్తారు..