మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మంచిర్యాలను 100 శాతం అక్షరాస్యత జిల్లాగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా వయోజన విద్యాధికారి పురుషోత్తంనాయక్, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ తిరుపతి, లయన్స్ క్లబ్ ప్రతినిధి సత్యనారాయణలతో కలిసి డి.ఆర్.పి.లు, లయన్ క్లబ్ సభ్యులతో న్యూ ఇండియా లిటరసీ కార్యక్రమం నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో న్యూ ఇండియా లిటరసీ కార్యక్రమంలో భాగంగా ఫేజ్-1ను ప్రారంభించడం జరిగిందని, జిల్లాలోని నిరక్షరాస్యులను గుర్తించి అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని తెలిపారు. 15 సం॥ల వయస్సు నుండి వృద్ధుల వరకు అక్షరాస్యులుగా మార్చాలని, జిల్లాలో నిర్వహించిన సర్వేలో దాదాపు 1 లక్షా 400 మంది నిరక్షరాస్యులు ఉన్నారని తెలిపారు. యు. ఎల్.ఎల్.ఎ.ఎస్. యాప్ ద్వారా వాలంటీర్లను గుర్తించి మ్యాచింగ్-బ్యాచింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని, లయన్స్ క్లబ్ సభ్యులు పిల్లల కోసం లయన్స్ టెస్ట్, హంగర్ ఎన్.ఎల్.ఐ.పి., మధుమేహ వ్యాధిగ్రస్తుల గుర్తింపు, చిన్న పిల్లలలో వచ్చే క్యాన్సర్, నిరుద్యోగ యువతకు ఉపాధి, విపత్తు నిర్వహణ, టైలరింగ్ కేంద్రాలతో పాటు న్యూ ఇండియా లిటరసీ కార్యక్రమాన్ని నిర్వహించాలని తెలిపారు.
అంగన్వాడీ టీచర్లు, ఉపాధ్యాయులు, సహాయకులు తమ పరిధిలోని నిరక్షరాస్యులను గుర్తించి వారి వివరాలు నమోదు చేయాలని, గ్రామాలు, మున్సిపాలిటీలను నిరక్షరాస్యులను గుర్తించి అక్షరాస్యులుగా తీర్చిదిద్దే విధంగా సెర్చ్, మెప్మా సిబ్బంది కృషి చేయాలని తెలిపారు. అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, వాలంటీర్లు సంయుక్తంగా పని చేసి జిల్లాలో అక్షరాస్యతా శాతాన్ని పెంపొందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.