• సంవత్సరం తిరగకముందే ఊడిపోతున్న అపార్ట్మెంట్లు, ఇండిపెండెంట్ హౌస్‌లు
• మంచిర్యాలలో నిర్మాణ రంగంపై తీవ్ర ఆరోపణలు

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మంచిర్యాలలో అపార్ట్మెంట్లు, ఇండిపెండెంట్ హౌస్‌ల నిర్మాణాల్లో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదంటూ ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. లక్షల రూపాయలు వసూలు చేసి నిర్మించిన భవనాలు సంవత్సరం పూర్తికాకముందే గోడలు చిట్లిపోవడం, ప్లాస్టర్ ఊడిపోవడం, సీలింగ్ నుంచి నీరు కారడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయని అపార్ట్మెంట్ వాసులు ఆరోపిస్తున్నారు. కొత్త ఇల్లు కొనుగోలు చేసి ప్రశాంతంగా జీవించాలని ఆశించిన కుటుంబాలు, ఇప్పుడు మరమ్మత్తుల కోసం అదనపు ఖర్చులు భరించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. కొందరు బిల్డర్లు నాణ్యత ప్రమాణాలను విస్మరించి కేవలం లాభాల కోసమే నిర్మాణాలు చేపడుతున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇండిపెండెంట్ హౌస్‌ల నిర్మాణాల్లో కూడా నాసిరకం మెటీరియల్ వినియోగం జరుగుతోందని, బయటకు ఆకర్షణీయంగా కనిపించే భవనాలు లోపల మాత్రం బలహీనంగా ఉంటున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. దీంతో నిర్మాణ రంగంలో నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మున్సిపల్, ఆర్ అండ్ బి శాఖల అధికారుల పనితీరుపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. భవన నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేసే ముందు నాణ్యత ప్రమాణాలపై కఠిన తనిఖీలు నిర్వహించాలని, నిర్మాణ సంస్థల నుంచి దీర్ఘకాలిక నాణ్యత హామీ తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నాణ్యతలేని నిర్మాణాల వల్ల భవిష్యత్తులో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్న అపార్ట్మెంట్ వాసులు, నిర్మాణ రంగంలో జరుగుతున్న అక్రమాలపై ప్రత్యేక విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. “జీవితాంతం దాచుకున్న డబ్బుతో ఇల్లు కొంటే, ఇప్పుడు మరమ్మత్తుల కోసం మళ్లీ ఖర్చు చేయాల్సి వస్తోంది” అంటూ పలువురు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
🔴 ప్రజల ప్రధాన డిమాండ్లు..?
• బిల్డర్లకు కఠిన నాణ్యత నిబంధనలు
• 20 ఏళ్ల నిర్మాణ హామీ తప్పనిసరి
• నిర్మాణాలకు ముందు, తర్వాత తనిఖీలు
• నాసిరకం నిర్మాణాలపై కఠిన చర్యలు
• బాధితులకు నష్టపరిహారం
“ఇళ్లా… లేక ఇబ్బందుల గూళ్లా..?” అనే ప్రశ్న ఇప్పుడు మంచిర్యాల అపార్ట్మెంట్, ఇండిపెండెంట్ హౌస్ వాసుల నుంచి గట్టిగా వినిపిస్తోంది.


