• మురుగునీరు రోడ్లపైకి.. దుర్వాసనతో కాలనీవాసుల అవస్థలు
• పట్టించుకోని మున్సిపల్ అధికారులు.. కార్పొరేటర్‌పై ప్రజల ఆగ్రహం

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రంలోని గ్రీన్ సిటీ కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా మారి కాలనీవాసులకు నిత్యనరకంగా మారింది. డ్రైనేజీ పైపుల నుంచి మురుగునీరు లీకై రోడ్లపైకి చేరుతుండటంతో తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. దీంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలనీలోని పలు వీధుల్లో మురుగునీరు నిల్వ ఉండటంతో దోమలు విపరీతంగా పెరిగాయని, సాయంత్రం వేళల్లో బయటకు రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొందని స్థానికులు చెబుతున్నారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో పరిస్థితి మరింత దారుణంగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మురుగునీటి కారణంగా డెంగ్యూ, మలేరియా, వైరల్ ఫీవర్లు వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, చిన్నారులు, వృద్ధుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని కాలనీవాసులు హెచ్చరిస్తున్నారు. ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారిన ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. డ్రైనేజీ సమస్యపై పలుమార్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడం పట్ల స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సమస్యను పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
మరోవైపు గ్రీన్ సిటీ కార్పొరేటర్ కూడా కాలనీలోని ప్రధాన సమస్యలను పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. అప్పుడప్పుడు జేసిబితో మొక్కలు తీయటం, ఇసుక తొలగించడం వంటి కార్యక్రమాలతో సరిపెట్టుకుంటున్నారే తప్ప డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచే చర్యలు తీసుకోవడం లేదని విమర్శిస్తున్నారు. “పన్నులు కడుతున్నాం.. కనీస సౌకర్యాలు ఎక్కడ?” అంటూ కాలనీవాసులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి గ్రీన్ సిటీ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, లేకపోతే ఆందోళన బాట పట్టాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.


