అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల్లో ఆంక్షలు విధించిన టీటీడీ
ఆంజనేయులు న్యూస్, తిరుమల: అలిపిరి నడక మార్గంలో ఏడోమైలు వద్ద బాలుడిపై చిరుత దాడి చేసిన నేపథ్యంలో తితిదే కీలక నిర్ణయాలు తీసుకుంది. చిరుత దాడి చేసిన ప్రాంతాన్ని శుక్రవారం తితిదే ఈవో ధర్మారెడ్డి పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దాడి చేసింది పిల్ల చిరుత కావడంతో బాలుడికి ప్రాణాపాయం తప్పిందన్నారు. దాడి జరిగిన సమయంలో భక్తులు పెద్దగా అరవడం, రిపీటర్ స్టేషన్ నుంచి లైట్లు వేయడంతో చిరుత బాలుడిని వదిలేసి వెళ్లి పోయిందన్నారు. తితిదే అటవీశాఖ అధికారులు చిరుత సంచారాన్ని గుర్తించారని, అలిపిరి గాలిగోపురం నుంచి నరసింహస్వామి గుడి వరకు చిరుత సంచరిస్తున్నట్టుగా తెలుస్తోందని చెప్పారు.
ఈ నేపథ్యంలో రాత్రి 7గంటల తర్వాత అలిపిరి నడక మార్గంలో గాలిగోపురం నుంచి 200 మంది భక్తులను ఒక బృందంగా కలిపి పంపేలా ఏర్పాట్లు చేశామన్నారు. వీరితో పాటు సెక్యూరిటీగార్డు ఉంటారని, భక్తులు గోవిందనామ స్మరణ చేస్తూ ముందుకు సాగుతారని చెప్పారు. చిన్నపిల్లలు బృందం మధ్యలో ఉండేలా చూసుకుని, వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చిరుతను పట్టుకునేందుకు ఏర్పాట్లు చేశామని, ఇందుకోసం కెమెరా ట్రాప్స్ కూడా సిద్ధం చేశారని చెప్పారు. శ్రీవారి మెట్టు మార్గంలో సాయంత్రం 6 గంటల వరకు, అలిపిరి నడక మార్గంలో రాత్రి 10 గంటల వరకు భక్తులను అనుమతిస్తారని తెలిపారు. సాయంత్రం 6గంటల తర్వాత ఘాట్ రోడ్లలో వెళ్లే ద్విచక్రవాహన దారుల భద్రతకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంపై ఆలోచిస్తున్నట్టు చెప్పారు.
కోలుకుంటున్న బాలుడు..
అలిపిరి నడక మార్గంలో చిరుత దాడిలో గాయపడిన బాలుడు కౌశిక్ తిరుమల శ్రీవారి అనుగ్రహంతో కోలుకుంటున్నాడని తితిదే ఛైర్మన్ వై. వి. సుబ్బారెడ్డి తెలిపారు. తిరుపతిలోని శ్రీపద్మావతి చిన్నపిల్లల హృదయాలయం ఐసీయూలో చికిత్స పొందుతున్న బాలుడిని శుక్రవారం ఆయన పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సాక్షాత్తూ శ్రీవేంకటేశ్వరస్వామి బాలుడి ప్రాణాలు కాపాడారని చెప్పారు. బాలుడికి ఎలాంటి ప్రమాదం లేదని, మరింత మెరుగైన వైద్యం అందిస్తామని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా శ్రీవారిమెట్టు, అలిపిరి నడక మార్గాల్లో వన్య ప్రాణులకు ఇబ్బంది లేకుండా రెండు వైపులా కంచె ఏర్పాటు చేస్తామన్నారు. అటవీశాఖ నిబంధనలు కంచె ఏర్పాటుకు అడ్డంకిగా మారితే అలిపిరి నడక మార్గంలో భక్తులను రాత్రి వేళలో అనుమతించే అంశంపై పునరాలోచిస్తామన్నారు.