Monday, November 9, 2026
HomeTelanganaబస్తీ దవాఖానలో విస్తృతంగా ఆరోగ్య సేవలు

బస్తీ దవాఖానలో విస్తృతంగా ఆరోగ్య సేవలు

📰 Generate e-Paper Clip

బస్తీ దవాఖానలో ఆరోగ్య అవగాహన కల్పిస్తున్న జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, డాక్టర్ రమ్య.

మంచిర్యాల, నవంబర్ 9, ( ఆంజనేయులు న్యూస్ )

మంచిర్యాల మున్సిపల్ పరిధిలోని హమాలివాడ బస్తీ దవాఖానను జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, వైద్యాధికారి డాక్టర్ రమ్య సందర్శించారు. ఈ సందర్భంగా బస్తీ దవాఖాన పరిధిలో ప్రజలకు, గర్భిణులకు అందిస్తున్న వైద్య సేవలు, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలను పరిశీలించి పలు ఆరోగ్య అంశాలపై అవగాహన కల్పించారు. బస్తీ దవాఖానలో ఆరోగ్య మహిళా కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు 9,500 మంది మహిళలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. అలాగే 30 ఏళ్లు పైబడిన వారిలో అధిక రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్ వంటి అసంక్రమిత వ్యాధులను ముందస్తుగా గుర్తించి చికిత్స అందిస్తున్నట్లు వివరించారు. బీపీ, షుగర్ వ్యాధులను నిర్లక్ష్యం చేస్తే గుండెపోటు, పక్షవాతం, కంటి చూపు తగ్గడం, కిడ్నీ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రజలు క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకొని వైద్యుల సూచనల మేరకు మందులు వాడాలని సూచించారు. గర్భిణులకు వైద్య పరీక్షలు, ఆరోగ్య బోధనతో పాటు కుక్క, పాము, తేలు కాటుకు సంబంధించిన అత్యవసర వ్యాక్సిన్లు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. తెలంగాణ డయాగ్నస్టిక్స్, ఈ-సంజీవని, టెలీ మానస్, వ్యాక్సినేషన్, పాలియేటివ్ కేర్ సేవలు కూడా అందిస్తున్నట్లు పేర్కొన్నారు. మలేరియా, డెంగ్యూ, చికెన్‌గున్యా వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నివారణ, క్షయ వ్యాధి ముందస్తు గుర్తింపు, పౌష్టికాహారం, జీవనశైలి మార్పులపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు. ఆరోగ్య కార్యక్రమాలకు సంబంధించిన పోస్టర్లను ప్రదర్శించడం ద్వారా ప్రజలకు అవసరమైన సమాచారాన్ని అందుబాటులో ఉంచుతున్నారు. ఈ కార్యక్రమంలో బస్తీ దవాఖాన సిబ్బంది టీ. మాలతి, దివ్య, జ్యోతి పాల్గొన్నారు. ప్రజలకు వైద్య సేవలు, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు అందించడంపై స్థానికులు సంతృప్తి వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.