
మంచిర్యాల జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులపై సంబంధిత శాఖల సమన్వయంతో పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలో గల కలెక్టర్ చాంబర్లో ట్రైనీ కలెక్టర్ పి. గౌతమితో కలిసి అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. నస్పూర్ మండలం తీగలపహాడ్ గ్రామంలోని రాంనగర్ కు చెందిన గుర్రాల వంశీకృష్ణ తన తాత పేరిట గల రెండు గదుల ఇంటిని తనకు తెలియకుండా మరొక వ్యక్తి తన పేరిట మున్సిపల్ రికార్డులలో మార్చుకోవడం జరిగిందని, ఈ విషయమై విచారించి న్యాయం చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. బెల్లంపల్లి పట్టణం సుభాష్ నగర్ కు చెందిన గొల్ల సంపత్ దివ్యాంగుడిని అయిన తనకు జాడి నారాయణ, జాడి వెంకట్ అనే వ్యక్తులు లావనిపట్టా భూమిని పట్టా భూమిగా చూపుతూ 2014లో నాకు విక్రయించారని, ఇట్టి భూమిపై మరల వారి పేరిట పట్టా పాస్ పుస్తకతాలు తీసుకుని రెండు సంవత్సరాలుగా ఇతరులకు కౌలుకు ఇచ్చి డబ్బులు తీసుకుంటున్నారని, నాకు విక్రయించిన భూమిపైకి నేను వెళితే నాపై దాడి చేస్తున్నారని, ఈ విషయమై విచారణ జరిపి నాకు న్యాయం చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. బెల్లంపల్లి పట్టణం హనుమాన్బస్తీకి చెందిన గడ్డల వెంకటి బెల్లంపల్లి కూరగాయల మార్కెట్ కాంటా ఏరియాలో గల తన భూమి అక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టడంపై బెల్లంపల్లి తహసిల్దార్, అర్.డి.ఓ. కార్యాలయాలలో దరఖాస్తు చేసుకున్నానని, తనకు చెందిన భూమిలో జరిపిన అక్రమ నిర్మాణాలను తొలగించి న్యాయం చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు. నెన్నెల మండలం బొప్పారం గ్రామస్తులు నెన్నెల శివారులోని దేవాలయ భూమిని కొందరు వ్యక్తులు అక్రమంగా ఆక్రమించుకొని విక్రయాలు జరుపుతూ ప్రభుత్వ భూమిని దుర్వినియోగపరిచి ఇట్టి భూమిపై వచ్చే ప్రయోజనాలను అక్రమంగా పొందుతున్నారని, ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపించి ప్రభుత్వ భూమిని స్వాధీనపరచుకుని కాపాడాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు.
హైదరాబాద్ ఓల్డ్ బోయినపల్లికి చెందిన బెల్లంకొండ ప్రభాకర్ రావు తన తండ్రి పేరిట కోటపల్లి మండలం దేవులవాడ గ్రామంలో గల భూమిలో ‘వారసత్వంగా తన వాటాకు వచ్చిన భూమిని జాయింట్ పట్టా నమోదు చేశారని, దీనిపై విచారించి తన పేరిట విరాసత్ చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. భీమారం మండలం కొత్తగూడెం కాలనీకి చెందిన మెండే సతీష్ తాను ప్రభుత్వం అందిస్తున్న గొర్రెల అభివృద్ధి పథకం కొరకు దరఖాస్తు చేసుకోగా గతంలో తీసుకున్నట్లుగా చూపుతుందని, కానీ తాను ఇప్పుడే దరఖాస్తు చేసుకున్నానని, దీనిపై విచారించి తనకు న్యాయం చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. జైపూర్ మండలం వేకుమట్ల గ్రామానికి చెందిన గుడికందుల లక్ష్మీనర్సయ్య గతంలో తాను మావోయిస్టుగా పనిచేసి ప్రభుత్వానికి లొంగిపోయినందున ప్రభుత్వం అందించిన భూమిని గత 7 సంవత్సరాలుగా సాగు చేసుకుంటూ జీవిస్తున్నానని, ఇట్టి భూమికి సంబంధించి ప్రొసీడింగ్ మంజూరు చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు. కన్నెపల్లి మండలం పోలంపల్లి గ్రామానికి చెందిన దుర్గం శంకరి తన తండ్రి నుండి వారసత్వంగా తనకు తన అన్న దుర్గం బిక్కయ్యకు సమాన వాటా రాగా, తన అన్న మరణించినందున ఆయన కూతురు మొత్తం భూమిని తన పేరిట పట్టా చేసుకోవడం జరిగిందని, ఈ విషయమై విచారించి సంబంధిత పట్టాను రద్దు చేసి తన తన వాటాగా వచ్చిన భూమికి పట్టా మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. హాజీపూర్ మండలం గుడిపేట గ్రామానికి చెందిన చిప్పకుర్తి బుచ్చమ్మతో పాటు మరో 7 మంది తమ తాత, ముత్తాతలకు ప్రభుత్వంచే జారీ చేయబడిన భూమిని తాము సాగు చేసుకుంటూ జీవిస్తున్నామని, ఇట్టి భూమిని కొందరు వ్యక్తులు అక్రమంగా ఆక్రమణకు ప్రయత్నిస్తున్నారని, ఇట్టి భూమికి సంబంధించి మా పేరిట ధరణిలో నమోదు చేసి పాస్ పుస్తకాలు మంజూరు చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు. మందమర్రి మండల కేంద్రానికి చెందిన తైదులు జంపన్న, సంపల్లి శంకర్, కుర్మ దినేష్ లు తాము దళిత బంధు పథకం కింద డైరీ ఫార్మ్ పెట్టుకున్నామని, ఎండు గడ్డి ద్వారా రావాల్సిన సొమ్మును ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. జన్నారం మండలం సింగరాయపేట గ్రామ సర్పంచ్, ఎం.పి.టి.సి., గ్రామస్తులు తమ దరఖాస్తులో గ్రామపంచాయతీ పరిధిలోని ఊర చెరువును కొందరు వ్యక్తులు ఆక్రమించుకొని తమ పేరిట పట్టా చేసుకోవడం జరిగిందని, ఈ విషయమై విచారణ జరిపి ఊర చెరువును గ్రామపంచాయతీకి ఇప్పించాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను సంబంధిత అధికారుల సమన్వయంతో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

