Wednesday, November 11, 2026
HomeTelanganaగురువు ప్రోత్సాహం.. విద్యార్థిని విజయానికి పునాది!

గురువు ప్రోత్సాహం.. విద్యార్థిని విజయానికి పునాది!

ఎంబీబీఎస్ సీటు సాధించిన పూర్వ విద్యార్థినికి ఘన సన్మానం.. రూ.5 వేల నగదు ప్రోత్సాహకం అందజేసిన గురువు దుర్గం శివానంద్

📰 Generate e-Paper Clip

పూర్వ విద్యార్థిని శిరీషను సన్మానిస్తున్న ఉపాధ్యాయుడు దుర్గం శివానంద్.

మంచిర్యాల, నవంబర్ 10, ( ఆంజనేయులు న్యూస్ )

విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించినప్పుడు వారిని గుర్తించి అభినందించడం గురువులకు ఎంతో ఆనందాన్నిస్తుంది. తన వద్ద ప్రాథమిక విద్యను అభ్యసించి, పట్టుదలతో చదివి ఎంబీబీఎస్ సీటు సాధించిన పూర్వ విద్యార్థిని శిరీషను గుర్తించిన ఉపాధ్యాయుడు దుర్గం శివానంద్ ఆమెను ఘనంగా సన్మానించి తన అభిమానం చాటుకున్నారు. ఈ సందర్భంగా రూ.5 వేల నగదును ప్రోత్సాహకంగా అందజేశారు. మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన పెంద్రం మోతీరాం, రత్నాబాయి దంపతుల ముగ్గురు సంతానంలో రెండో కుమార్తె శిరీష. ఆమె 2012 నుంచి 1వ తరగతి నుంచి 4వ తరగతి వరకు నర్సాపూర్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడు దుర్గం శివానంద్ వద్ద చదువుకుంది. చిన్ననాటి నుంచే చదువులో చురుకుగా ఉండేదని, విద్య పట్ల ఆసక్తి కనబరిచేదని గురువు గుర్తుచేసుకున్నారు. అనంతరం 5వ తరగతి నుంచి పదో తరగతి వరకు కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్‌లో, ఇంటర్మీడియట్‌ను వికారాబాద్ జిల్లా పరిగిలో పూర్తి చేసింది. వైద్య విద్యను అభ్యసించాలనే లక్ష్యంతో నీట్ పరీక్ష రాసిన శిరీషకు మొదటి ప్రయత్నంలో నిరాశ ఎదురైంది. అయినప్పటికీ పట్టుదల వీడకుండా ఉచిత లాంగ్‌టర్మ్ శిక్షణ తీసుకుని కష్టపడి చదివింది. రెండో ప్రయత్నంలో నీట్‌లో మంచి ర్యాంకు సాధించి కొడంగల్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సంపాదించింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు దుర్గం శివానంద్ మాట్లాడుతూ.. తన వద్ద చదువుకున్న విద్యార్థిని వైద్య విద్యలో సీటు సాధించడం ఎంతో సంతోషంగా ఉందని, ఆమె చిన్ననాటి నుంచే చదువులో చురుకుగా ఉండేదని తెలిపారు. విద్యార్థిని శిరీష మాట్లాడుతూ.. చిన్నతనంలో గురువుగారు చెప్పిన సూచనలు, మాటలను ఇప్పటికీ గుర్తుంచుకుని ముందుకు సాగానని, ఆయన ప్రోత్సాహం తనకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని తెలిపింది. తన పూర్వ విద్యార్థిని సాధించిన విజయాన్ని గుర్తించి గురువు స్వయంగా సన్మానించడంతో పాటు నగదు ప్రోత్సాహకం అందించడం పలువురికి ఆదర్శంగా నిలిచింది. ఈ కార్యక్రమంలో శిరీష తల్లిదండ్రులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.