వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు.
మంచిర్యాల, నవంబర్ 10, ( ఆంజనేయులు న్యూస్ )
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్, వివిధ ప్రోగ్రాం డైరెక్టర్లతో కలిసి జిల్లా వైద్యాధికారులు, ప్రోగ్రాం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి మంగళవారం జిల్లాల వారీగా నిర్వహించే సమీక్షలో భాగంగా జిల్లాలో అమలవుతున్న వివిధ ఆరోగ్య కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా మాతా శిశు సంరక్షణ, గర్భిణుల నమోదు, గర్భిణులకు నిర్వహించే వైద్య పరీక్షలు, టీకాల కార్యక్రమాల అమలు, అన్ని రకాల వ్యాక్సిన్లు అందుబాటులో ఉంచడం వంటి అంశాలపై సమీక్షించారు. ప్రతి బుధ, శనివారాల్లో నిర్వహించే టీకాల కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. అలాగే బీపీ, షుగర్, క్యాన్సర్ వంటి అసంక్రమిత వ్యాధుల బాధితులను ముందస్తుగా గుర్తించి అవసరమైన వైద్య సేవలు, మందులు అందించాలని సూచించారు. జీవనశైలి మార్పులతో వచ్చే వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. సంక్రమిత వ్యాధులు, కీటక జనిత వ్యాధుల నియంత్రణ, టెలీ మానస్, ఈ-ఔషధి, ఈ-సంజీవని, టీబీ వ్యాధిగ్రస్తుల గుర్తింపు, వారికి పోషకాహార కిట్ల పంపిణీ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాల్లో అందిస్తున్న సేవలు, కుక్కకాటు, పాముకాటు బాధితులకు వైద్యం, క్రిటికల్ కేర్ సేవలు, వ్యాక్సిన్ల లభ్యతపై జిల్లాల వారీగా వివరాలు తెలుసుకున్నారు. అదేవిధంగా ‘మీ ప్రాణం’ కార్యక్రమంలో భాగంగా వైద్య సిబ్బంది హాజరు నమోదు, వైద్య శిబిరాల నిర్వహణ, లింగ నిర్ధారణ పరీక్షలకు సంబంధించిన వివరాల నమోదు, ప్రజలకు అవగాహన కల్పించడం వంటి అంశాలపై కూడా సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఉప జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు డాక్టర్ సుధాకర్ నాయక్, డాక్టర్ అరుణశ్రీ, డాక్టర్ అనిల్ కుమార్, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, జిల్లా ఆరోగ్య బృందం సభ్యులు ఆర్.ఎస్. పద్మ, కాకిరాల వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, సుమన్, సురేందర్, ఫార్మసీ అధికారులు శ్రీనివాస్, ప్రోగ్రాం అధికారి శంకర్ తదితరులు పాల్గొన్నారు.
