Wednesday, November 11, 2026
HomeTelanganaమంచిర్యాలపుష్కరాల పనులకు పక్కా అంచనాలు సిద్ధం చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్

పుష్కరాల పనులకు పక్కా అంచనాలు సిద్ధం చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్

📰 Generate e-Paper Clip

పుష్కరాల పనులపై అధికారులతో సమీక్షిస్తున్న కలెక్టర్ కుమార్ దీపక్.

మంచిర్యాల, నవంబర్ 10, ( ఆంజనేయులు న్యూస్ )

గోదావరి పుష్కరాలు–2027 నిర్వహణకు చేపట్టాల్సిన అభివృద్ధి, మౌలిక సదుపాయాల పనులకు పక్కా అంచనాలతో బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 14వ తేదీలోగా అన్ని శాఖల అధికారులు తమ ప్రతిపాదనలను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. మంగళవారం నస్పూర్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవనంలో డీసీపీ ఎ.భాస్కర్, అదనపు కలెక్టర్లు పి.చంద్రయ్య, వి.రాములుతో కలిసి వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పుష్కరాల నేపథ్యంలో ఘాట్ల అభివృద్ధి, నిర్వహణ, భూసేకరణ, విద్యుత్, ఇరిగేషన్ తదితర అవసరాలకు సంబంధించి వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా అంచనాలు రూపొందించాలని సూచించారు. ఏ ఒక్క పని కూడా ప్రతిపాదనల్లో మినహాయింపు కాకుండా చూడాలని, తక్కువ అంచనాలతో ప్రతిపాదనలు పంపి భవిష్యత్తులో అదనపు నిధుల కోసం ఇబ్బందులు పడవద్దని అధికారులకు సూచించారు. భూసేకరణకు సంబంధించి భూమి విస్తీర్ణం, ప్రస్తుత మార్కెట్ విలువ ఆధారంగా అంచనాలు రూపొందించాలని, విద్యుత్ శాఖ అధికారులు గతంలో వచ్చిన ఛార్జీలను పరిగణనలోకి తీసుకొని భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని తెలిపారు. చెన్నూర్ గోదావరి పుష్కర ఘాట్ల అభివృద్ధిపై ప్రత్యేకంగా సమీక్షించిన కలెక్టర్, ఇప్పటికే ఎడమవైపు ఘాట్‌కు మంజూరైన పనులు, మరమ్మతులతో పాటు కుడివైపు ఘాట్‌కు అవసరమైన అభివృద్ధి పనులను కూడా గుర్తించాలని ఆదేశించారు. మంచిర్యాల, చెన్నూర్ ఇరిగేషన్ డివిజన్ల అధికారులు సమన్వయంతో సమగ్ర ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు. పుష్కరాల సమయంలో భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ఘాట్ల పటిష్టతను క్షేత్రస్థాయిలో పరిశీలించి అవసరమైన మరమ్మతులు, బలోపేతం పనులు చేపట్టాలని పేర్కొన్నారు. పుష్కరాలు ప్రారంభమయ్యే నాటికి ఘాట్లు పూర్తిస్థాయిలో సురక్షితంగా, భక్తులకు అందుబాటులో ఉండేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ నెల 14వ తేదీలోగా అన్ని శాఖల అధికారులు తమ పరిధిలోని పనులు, అదనపు అవసరాలను సమగ్రంగా పరిశీలించి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.