Friday, September 11, 2026
HomeCrime1980’s ట్రెండ్‌పై సైబర్ వల..!

1980’s ట్రెండ్‌పై సైబర్ వల..!

సోషల్ మీడియాలో ఫేక్ AI యాప్‌లు.. ఓపెన్ చేస్తే చాలు.. డేటా హ్యాకర్ల చేతికి!

📰 Generate e-Paper Clip

తెలంగాణ సెప్టెంబర్ 11, ( ఆంజనేయులు న్యూస్ )

ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘1980’s ట్రెండ్’ ఫొటోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. చాట్‌జీపీటీ వంటి ఆధునిక ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సాధనాలను ఉపయోగించి తమ ఫొటోలను 1980ల నాటి లుక్‌లోకి మార్చుకుంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అయితే ఈ క్రేజ్‌ను సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మలుచుకుంటూ కొత్త మోసాలకు తెరతీస్తున్నారు. ఏఐ ఫొటో ట్రెండ్‌ను ఉపయోగించుకుని ‘1980s AI Trend’ పేరుతో నకిలీ యాప్‌లు, ఏపీకే ఫైళ్లను రూపొందించి సోషల్ మీడియా, థర్డ్‌పార్టీ వెబ్‌సైట్లు, టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా వ్యాప్తి చేస్తున్నట్లు సైబర్ భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాట్‌జీపీటీ వంటి ఏఐ సాధనాల్లో ఉచిత వినియోగానికి పరిమితులు ఉండటం, కొన్నిసార్లు ఆశించిన విధంగా ఫొటోలు రాకపోవడంతో కొందరు నెటిజన్లు ప్రత్యామ్నాయ యాప్‌ల కోసం వెతుకుతున్నారు. ఇదే అవకాశంగా చేసుకున్న సైబర్ నేరగాళ్లు 1980ల నాటి ఫేషియల్‌ స్టైల్స్‌, హెయిర్‌స్టైల్స్‌, డ్రెస్సింగ్‌ లుక్‌తో ఫొటోలను క్షణాల్లో మార్చేస్తామంటూ నకిలీ యాప్‌లను ప్రచారం చేస్తున్నారు. ఆసక్తితో ఆ ఏపీకే ఫైళ్లను డౌన్‌లోడ్‌ చేసి ఇన్‌స్టాల్‌ చేస్తే అసలు మోసం మొదలవుతుంది. మాల్వేర్‌తో కూడిన నకిలీ యాప్‌ ఫోన్‌లోకి చేరిన తర్వాత వినియోగదారుల నుంచి అనవసరమైన అనుమతులు తీసుకుని ప్రైవేట్‌ ఫొటోలు, కాంటాక్ట్స్‌, గ్యాలరీలోని సమాచారం, ఇతర వ్యక్తిగత డేటాను దొంగిలించే ప్రమాదం ఉంది. మాల్వేర్‌ యాప్‌లు ఎస్‌ఎంఎస్‌ వంటి సున్నితమైన సమాచారాన్ని కూడా యాక్సెస్‌ చేయగల సందర్భాలు ఉన్నాయని సైబర్‌ భద్రతా సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ఇక ఫోన్‌లోని వ్యక్తిగత సమాచారం సైబర్‌ నేరగాళ్ల చేతికి చిక్కితే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. ఫొటోలు, వ్యక్తిగత వివరాలను దుర్వినియోగం చేసి బాధితులను బెదిరించడం, డబ్బులు డిమాండ్‌ చేయడం వంటి నేరాలకు పాల్పడే అవకాశం ఉండటంతో అప్రమత్తత అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. బ్యాంకింగ్‌ వివరాలు, ఓటీపీలు వంటి సున్నితమైన సమాచారాన్ని లక్ష్యంగా చేసుకునే మాల్వేర్‌ దాడులు ఇప్పటికే నమోదైన నేపథ్యంలో అపరిచిత ఏపీకే ఫైళ్ల విషయంలో మరింత జాగ్రత్త అవసరం. అందుకే 1980’s ఫొటో ట్రెండ్‌ ఎంత ఆకర్షణీయంగా ఉన్నా.. తెలియని లింకులు, థర్డ్‌పార్టీ వెబ్‌సైట్లు, టెలిగ్రామ్‌ గ్రూపుల ద్వారా వచ్చే ఏపీకే ఫైళ్లను డౌన్‌లోడ్‌ చేయవద్దని సైబర్‌ నిపుణులు సూచిస్తున్నారు. అధికారిక యాప్‌ స్టోర్లలో అందుబాటులో ఉన్న నమ్మకమైన యాప్‌లను మాత్రమే ఉపయోగించాలని, యాప్‌ కోరుతున్న అనుమతులను ముందుగా పరిశీలించాలని సూచిస్తున్నారు. తెలియని మూలాల నుంచి యాప్‌లను ఇన్‌స్టాల్‌ చేయకుండా ఉండటమే సైబర్‌ మోసాల నుంచి రక్షణకు తొలి అడుగు అని స్పష్టం చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.