ఉత్తరప్రదేశ్ ఆగస్టు 31, ( ఆంజనేయులు న్యూస్ )
అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో కట్టుకున్న భర్తనే ప్రియుడితో కలిసి భార్య హత్య చేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాలో వెలుగుచూసింది. అనంతరం హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు నిందితులు ప్రయత్నించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. శక్తినగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రామశంకర్ మిశ్ర (42) ఎన్సీఎల్ బీనాలో సీనియర్ ఓవర్‌మ్యాన్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయన భార్య ప్రియాంక మిశ్ర (35) అదే ప్రాంతానికి చెందిన వికాస్ చౌహాన్ (25)తో కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆగస్టు 22న రామశంకర్ ఇంటికి తిరిగి వచ్చిన సమయంలో భార్య ప్రియాంక, వికాస్‌ను అనుమానాస్పద పరిస్థితుల్లో గుర్తించినట్లు సమాచారం. దీనిపై ఆయన వారిని ప్రశ్నించడంతో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ప్రియాంక, వికాస్ కలిసి రామశంకర్పై దాడి చేసి హతమార్చినట్లు దర్యాప్తులో వెల్లడైంది. హత్య అనంతరం ఘటనను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు వికాస్ తన స్నేహితులు అనురాగ్, సోనుల సహాయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. రామశంకర్ మృతదేహాన్ని రహదారి పక్కన పడేసి ప్రమాదంగా నమ్మించే ప్రయత్నం చేసినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నివేదికతో పాటు ఇతర ఆధారాలను పరిశీలించగా ఇది ప్రమాదం కాదని, హత్యగా నిర్ధారణకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. దర్యాప్తు అనంతరం ప్రియాంక, వికాస్‌తో పాటు అనురాగ్, సోనులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సమాచారం. అక్రమ సంబంధం నేపథ్యంలో చోటుచేసుకున్న ఈ హత్య ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
