Friday, September 11, 2026
HomeTelanganaవినాయక ఉత్సవాలకు పోలీస్‌ శాఖ మార్గదర్శకాలు: సీఐ శ్రీనివాసరావు

వినాయక ఉత్సవాలకు పోలీస్‌ శాఖ మార్గదర్శకాలు: సీఐ శ్రీనివాసరావు

📰 Generate e-Paper Clip

బెల్లంపల్లి, సెప్టెంబర్ 11, ( ఆంజనేయులు న్యూస్ )

వినాయక చవితి సందర్భంగా బెల్లంపల్లి మున్సిపల్‌ పరిధిలో గణపతి మండపాలు ఏర్పాటు చేసి ఉత్సవాలు నిర్వహించాలనుకునే నిర్వాహకులు తప్పనిసరిగా పోలీస్‌ శాఖకు సమాచారం అందించాలని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వన్‌టౌన్‌ సీఐ కే. శ్రీనివాసరావు సూచించారు. ఈ నెల 14న వినాయక చవితి నేపథ్యంలో మండపాల నిర్వాహకులు ముందుగానే తమ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని తెలిపారు. విగ్రహం ఏర్పాటు చేసే ప్రదేశం, సంబంధిత పోలీస్‌ స్టేషన్‌ పరిధి, విగ్రహం, మండపం ఎత్తు, ఉత్సవ కమిటీ సభ్యుల పేర్లు, ఫోన్‌ నంబర్లు, చిరునామాలతో పాటు విగ్రహ ప్రతిష్ఠాపన తేదీ, నిమజ్జనం తేదీ, సమయం, ప్రదేశం, నిమజ్జనానికి వినియోగించే వాహనం వివరాలను policeportal.tspolice.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని సూచించారు. మండప నిర్వాహకులు, గణపతి ఉత్సవ కమిటీ సభ్యులు, వాలంటీర్ల వివరాలను కూడా పూర్తిగా నమోదు చేయాలని చెప్పారు. ఆన్‌లైన్‌ నమోదులో ఇబ్బందులు ఎదురైతే సమీప పోలీస్‌ స్టేషన్‌ను సంప్రదించాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని ఉత్సవ కమిటీలు మట్టి వినాయక విగ్రహాల ప్రతిష్ఠాపనకు ప్రాధాన్యత ఇవ్వాలని సీఐ కోరారు. మండపాల నిర్వాహకులు పోలీస్‌ శాఖ నిబంధనలకు లోబడి ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలను నిర్వహించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో పోలీస్‌ యంత్రాంగం 24 గంటలు అందుబాటులో ఉంటుందని తెలిపారు. ప్రజలు అత్యవసర సమయంలో వెంటనే డయల్‌ 100 లేదా 112కు సమాచారం అందించాలని సీఐ కే. శ్రీనివాసరావు కోరారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.