సాఫ్ట్ వేర్ అప్డేట్, భద్రతాపరమైన లోపాల కారణంగా వాట్సాప్ కొత్త ఏడాది నుంచి స్మార్ట్ ఫోన్లలో తన సేవలను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. సుమారు 49 స్మార్ట్ ఫోన్ మోడల్స్ ఈ జాబితాలో ఉన్నాయి.
ఆంజనేయులు న్యూస్: యూజర్లకు మెరుగైన సేవలు అందించడంలో భాగంగా వాట్సాప్ ఎప్పటికప్పుడు యాప్ ను అప్డేట్ చేస్తూ.. కొత్త ఫీచర్లను పరిచయం చేస్తుంది. అంతేకాదు, తమ సాంకేతికతకు అనుకూలంగా లేని స్మార్ట్ ఫోన్లకు తన సేవలను నిలిపివేస్తుంది. అలా, కొత్త ఏడాదిలో కూడా కొన్ని ఫోన్లలో వాట్సాప్ సేవలను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. సాఫ్ట్ వేర్ అప్డేట్, భద్రతాపరమైన లోపాల వల్ల 49 స్మార్ట్ ఫోన్ మోడల్స్ కు వాట్సాప్ సపోర్ట్ ను ఉపసంహరించుకున్నట్లు తెలిపింది. యూజర్లు ఈ మార్పును గమనించాలని కోరింది. జనవరి 1 నుంచి వాట్సాప్ కొత్తగా విడుదల చేసే ఫీచర్, సెక్యూరిటీ అప్డేట్లు ఇకపై ఆయా ఫోన్లకు రావని తెలిపింది. వాట్సాప్ పేర్కొన్న 49 మోడల్స్ లో ఎక్కువగా పాత వెర్షన్ మొబైల్స్ ఉన్నాయి. ఈ జాబితాలో ఐఫోన్ 5, 5సీతోపాటు శాంసంగ్ గెలాక్సీ సిరీస్లో కోర్, ఎస్2, ఎస్3 మినీ, ట్రెండ్ 2, ట్రెండ్ లైట్, ఎక్స్కవర్ 2, ఏ2 మోడల్స్ ఉన్నాయి. ఇవికాకుండా హెచ్సి డిజైర్, లెనోవా ఏ820, క్వాడ్ ఎక్స్ టెల్, ఎలీ ఎనాక్ట్, ఎలీ లూసిడ్ 2 మోడల్స్ తోపాటు ఎలీ ఆప్టిమస్ సిరీస్, సోనీ ఎక్స్పిరీయా ఆర్క్ ఎస్, ఎక్స్పిరియా మిరో, ఎక్స్పిరియా నియో ఎల్, ఆర్కోస్ 53 ప్లాటినమ్, గ్రాండ్ ఎస్ ఫ్లెక్స్ జెడ్ ఈ, గ్రాండ్ ఎక్స్ క్వాడ్ వీ987 జెడీఈ, వికో సింక్ ఫైవ్, వికో డార్నెట్ జెడ్ మోడల్స్ లో డిసెంబరు 31 తర్వాత వాట్సాప్ పనిచేయదని తెలిపింది. ఇప్పటికీ ఈ ఫోన్లను ఎవరైనా ఉపయోగిస్తుంటే కొత్త ఫోన్ కొనుగోలు చేయడం లేదా వాట్సాప్ వినియోగం ఆపేయడం మినహా మరో మార్గంలేదని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. ఇటీవలే వాట్సాప్ స్టేటస్ అప్డేట్ రిపోర్ట్ అనే ఫీచర్ ను పరిచయం చేయనున్నట్లు వెల్లడించింది. ఈ ఫీచర్ వల్ల యూజర్లు ఇతరులు స్టేటస్ పై ఏవైనా అభ్యంతరాలు ఉన్నా, అనుమానాస్పదంగా ఉన్నా వాట్సాప్ కు ఫిర్యాదు చేయొచ్చు. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్ ను త్వరలో యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది.


