ఎమ్మెల్యేల కొనుగోలు అంశం మీద తెరాస నేతలు అభాసుపాలవుతున్నారని భాజపా ఎంపీ కె. లక్ష్మణ్ అన్నారు. రాష్ట్రంలో ఫిరాయింపులకు పెట్టింది పేరు తెరాస, కేసీఆర్ అంటూ విమర్శలు గుప్పించారు.
ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక దృష్ట్యా తెరాస తీరు పట్ల ప్రజలు విసిగి పోయారని భాజపా రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్ అన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు అంశం మీద తెరాస నేతలు అభాసుపాలవుతున్నారన్నారు. రాష్ట్రంలో ఫిరాయింపులకు పెట్టింది పేరు తెరాస, కేసీఆర్ అంటూ విమర్శలు గుప్పించారు. 2018 ఎన్నికల అనంతరం తెరాసకు స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఫిరాయింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఫిరాయింపుల చరిత్ర ఉన్న తెరాస భాజపాపై నిందలు వేస్తే రాష్ట్ర ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చే వారిని రాజీనామా చేయించి. తమ పార్టీ గుర్తుపై ఎమ్మెల్యేగా ఎన్నుకునే సంప్రదాయం భాజపాకు ఉందని స్పష్టం చేశారు. మునుగోడులో ఓటమి భయంతోనే కేసీఆర్ నాటకాలాడుతున్నారని లక్ష్మణ్ విమర్శించారు.

