Telugu Updates
Logo
mobile after logo

అర్హతలేని ఉపాధ్యాయులతో పాఠశాలలు..

  • విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో!
  • ఫీజుల కోసమే పాఠశాలలు? తల్లిదండ్రుల ఆవేదన
  • పట్టించుకోని ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు 

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లాలోని అనేక ప్రైవేట్ పాఠశాలల్లో అర్హతలు, అనుభవం లేని ఉపాధ్యాయులతో బోధన కొనసాగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కనీస టీచర్ ట్రైనింగ్ లేకుండానే ఉపాధ్యాయులను నియమించుకోవడం, విధుల్లో ఉండగానే బీఈడీ వంటి శిక్షణలు కొనసాగించడం విద్యా ప్రమాణాలపై తీవ్ర ప్రభావం చూపుతోందని ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడంలేదని చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సోషల్ మీడియా ఆధారంగా పాఠాలు చెప్పడం, సరైన అవగాహన లేకుండా బోధించడం వల్ల విద్యార్థులు మూలభూత జ్ఞానాన్ని కోల్పోతున్నారని విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు. ఆత్మపరిశీలన లేని ఉపాధ్యాయులు భావి పౌరులను ఎలా తీర్చిదిద్దగలరని ప్రశ్నిస్తున్నారు. తరగతి పుస్తకాలను కేవలం 3–4 నెలల్లో ముగించి, ఐఐటి వంటి పోటీ పరీక్షలపై దృష్టి పెట్టడం చిన్నారులపై తీవ్రమైన ఒత్తిడిని సృష్టిస్తోంది. దీని వల్ల స్వతంత్ర ఆలోచన తగ్గిపోవడం, మానసిక ఒత్తిడి పెరగడం వంటి సమస్యలు కనిపిస్తున్నాయి.

ఫలితాలు ఆశించినంతగా రాకపోవడంతో విద్యార్థుల్లో నిరాశ పెరుగుతుండగా, కొన్నిచోట్ల ఆత్మహత్యల వంటి ఘటనలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. వేలాది రూపాయలు ఖర్చు చేస్తున్నప్పటికీ సరైన ఫలితాలు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. పాఠశాలల దృష్టి ప్రధానంగా ఫీజులు, అడ్మిషన్లపైనే కేంద్రీకృతమైందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక ఆరోగ్య పరంగా కూడా సమస్యలు ఉధృతమవుతున్నాయి.

క్రీడా స్థలాల లేమి, శుభ్రత లేని టాయిలెట్లు, 3–5 అంతస్తుల భవనాల్లో తరచూ ఎక్కి దిగాల్సిన పరిస్థితులు విద్యార్థులపై ప్రభావం చూపుతున్నాయి. భారీ పుస్తకాల బరువు కారణంగా చిన్న వయసులోనే వెన్నెముక, మోకాళ్ల నొప్పులు వంటి శారీరక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి ప్రైవేట్ పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని, అర్హతలేని ఉపాధ్యాయులను తొలగించి, కనీస సదుపాయాలు కల్పించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. “విద్య వ్యాపారం కాకూడదు… భవిష్యత్తు తరాలకు బలమైన పునాది కావాలని వారు ఆకాంక్షిస్తున్నారు.

Post bottom