Telugu Updates
Logo
mobile after logo

విద్యార్థులకు అలర్ట్.. ఈ నకిలీ వెబ్సైట్ తో జాగ్రత్త!

CBSE పేరుతో నకిలీ వెబ్సైట్ పేరిట డబ్బులు వసూలు చేస్తున్నట్లు పీఐబీ దృష్టికి వచ్చింది. ఇలాంటి వాటి పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలంటూ ట్వీట్ చేసింది.

ఆంజనేయులు న్యూస్: సైబర్ నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. అవకాశం ఉన్న చోట అందినకాడికి దోచుకుంటున్నారు. తాజాగా సీబీఎస్ఈ (CBSE) విద్యార్థులే లక్ష్యంగా మోసాలకు దిగారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) పేరిట ఓ నకిలీ వెబ్సైట్ తెరిచి కొత్త దందాకు తెరతీశారు. రిజిస్ట్రేషన్ ఫీజు పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నట్లు దృష్టికి రావడంతో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) అప్రమత్తమైంది. ఇలాంటి నకిలీ వెబ్సైట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని విద్యార్థులకు ట్విటర్ వేదికగా ఫ్యాక్ట్చిక్ (factcheck) అలర్ట్ జారీ చేసింది. cbsegovt.com పేరిట ఓ నకిలీ వెబ్సైట్ లో అడ్మిట్ కార్డు రిజిస్ట్రేషన్ కోసం డబ్బులు కట్టాలని ఫేక్ లింక్ చూపిస్తోందంటూ పీఐబీ దృష్టికి వచ్చింది. దీంతో ఈ సైట్ కు ఎలాంటి అనుమతీ లేదని పీఐబీ తెలిపింది. కేవలం cbse. gov.in, cbse. nic. in మాత్రమే సీబీఎస్ఈకి చెందిన అధికారిక వెబ్సైట్లు అని పేర్కొంది. పరీక్ష తేదీలు, డేటా షీట్లు, పరీక్షా ఫలితాలు మొదలైన సమాచారం కోసం అధికార వెబ్సైట్లను సంప్రదించాలని తెలిపింది. ఏదైనా సమాచారం తనిఖీ చేసేటప్పుడు అసలుదా? నకిలీదా? అనేది చెక్ చేసుకోవాలని సూచించింది.

Post bottom