Telugu Updates
Logo
mobile after logo

వరి కొయ్యల దహనంతో నేలకు, పర్యావరణానికి ముప్పు

మండల వ్యవసాయ అధికారి రామకృష్ణ

ఆంజనేయులు న్యూస్, ఆసిఫాబాద్ జిల్లా: రైతులు వరి కొయ్యలను తగలబెట్టడం వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని కాగజ్నగర్, దహేగాం, పెంచికల్పేట్, మండల వ్యవసాయ అధికారి రామకృష్ణ అన్నారు. మంగళవారం దహేగాం మండలం గిరివెల్లి, కర్జీ, గ్రామాల రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో వరి పంటను కొడవళ్లతో మొదళ్ల వరకు కోసేవారు. పశువులు ఎక్కువగా ఉండటంతో గడ్డిని కుప్పలు కుప్పలుగా పశుగ్రాసం కోసం నిల్వ చేసేవారని, ప్రస్తుతం సాగు విధానంలో మార్పులొచ్చాయి. పశువుల సంఖ్య తగ్గిపోవడంతో యంత్రాలను విరివిగా వినియోగిస్తున్నారు. హార్వెస్టర్లతో వరి పైరును పైకి కోయడంతో కొయ్యలు పెద్దగా మిగిలిపోతున్నాయి. అవసరమున్న రైతులు కొంత గడ్డిని తీసుకొచ్చుకొని, మిగిలిన దానిని అక్కడే వదిలేస్తున్నారు. దీంతో దున్నే సమయంలో నాగళ్లకు అడ్డుగా వస్తున్నాయని రైతులు వరి, మొక్కజొన్న కొయ్యలతో పాటు గడ్డిని కాల్చి వేస్తున్నారు. వరి కొయ్యలను కాల్చితే నేలలోని సేంద్రియ పదార్థాలు, పోషకాలు నశిస్తాయి. నేలలో ఉన్న వానపాములు, సూక్ష్మజీవులు వేడితో చనిపోతాయి. వాయు కాలుష్యం పెరిగి కార్బన్ ఉద్గారాలు వాతావరణ మార్పులకు దారి తీస్తాయి. పొగ వల్ల శ్వాస సమస్యలు, దగ్గు, కంటి మంట, ఊపిరితిత్తుల వ్యాధులు వస్తాయి. పొలంలో గాలి ప్రసరణ, నీటి చొరబాటు తగ్గి తదుపరి పంట దిగుబడి పడిపోతుంది. భూమి గట్టిపడి నీరు నిల్వ సామర్థ్యం తగ్గిపోతుంది. క్రమేపి చౌడు భూమిగా మారుతుంది. దీంతో అధిక నష్టాలు వచ్చే అవకాశముందని, వరికొయ్యలను తగులబెట్టొద్దని రైతులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. భూమి కలియ దున్నితే కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించారు.ఈ కార్యక్రమంలో గిరివెల్లి, కర్జీ, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.

Post bottom