Telugu Updates
Logo
mobile after logo

ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి

మంచిర్యాల జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: ప్రజావాణి కార్యక్రమంలో అందిన ప్రతి దరఖాస్తులు క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత అధికారుల సమన్వయంతో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. సోమవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని జిల్లా కలెక్టర్ చాంబర్లో జిల్లా కలెక్టర్, సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. రాహుల్, మంచిర్యాల రాజస్వ మండల అధికారి వి.రాములుతో కలిసి అర్జీదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. మంచిర్యాల పట్టణానికి చెందిన జాడి రాజమల్లు తన తండ్రి నుండి వారసత్వంగా తనకు సంక్రమించిన భూమికి సంబంధించిన హద్దులు, మ్యాప్, నకలు ప్రతుల కోసం సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేయడం జరిగిందని, మంజూరు చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు. మందమర్రి పట్టణంలోని ఇందిరానగర్కు చెందిన మడిపెల్లి పద్మ తాను 1994లో మందమర్రి శివారులో భూమిని కొనుగోలు చేసి నాటి నుండి సాగు చేసుకుంటున్నామని, ధరణిలో వేరే వారి పేర్లు రావడంతో పాటు ఇట్టి భూమిని విక్రయించినట్లుగా రికార్డులలో పొందుపరిచారని, ఈ విషయమై విచారించి తమకు న్యాయం చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. నస్పూర్ పట్టణంలోని నాగార్జునకాలనీకి చెందిన సిహెచ్.శ్రీలత తాను పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశానని, కొడుకుతో కలిసి ఒంటరిగా జీవిస్తున్నానని, ఉపాధి కల్పించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. మందమర్రి మండలం ఎర్రగుంటపల్లి గ్రామానికి చెందిన పోచంపల్లి కొమురయ్య హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం గ్రామ శివారులో తనకు కలిగిన పట్టా భూమికి సంబంధించి పట్టా పాసు పుస్తకం మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. మందమర్రి మండలం ఊరు రామకృష్ణాపూర్ కు చెందిన మెంగని శ్రీనివాస్ తనకు మందమర్రి శివారులో ఉన్న పట్టా భూమిని కొందరు అక్రమంగా ఆక్రమించుకుని పట్టా పుస్తకం పొందారని, వివరాలను తొలగించి తన పేరిట పట్టా పాసు పుస్తకం మంజూరు చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు. మందమర్రి మండలం గద్దె రాగడి ప్రాంతానికి చెందిన కునారపు ప్రకాష్ తన తండ్రి పేరిట కేతనపల్లి శివారులో ఉన్న భూమిని తన పేరిట నమోదు చేసి పట్టా పాస్ పుస్తకం మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. కన్నేపల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన దుర్గం దసురయ్య, దుర్గం రాజ్ కుమార్ తమ తాతల నుండి వారసత్వంగా వస్తున్న పట్టా భూమికి సంబంధించి రికార్డులలో వేరే వారి పేర్లు వస్తున్నాయని, సవరించి తమకు న్యాయం చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు. కన్నేపల్లి మండలం కొత్తపల్లి గ్రామపంచాయతీకి చెందిన దుర్గం దసురయ్య ప్రభుత్వం అందిస్తున్న ఆసరా పెన్షన్లు తమ గ్రామంలో అనర్హులకు అందుతున్నాయని, ఈ విషయంపై విచారించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. హైదరాబాద్ పట్టణానికి చెందిన చుంచు శ్రీనంద తనకు దండేపల్లి మండలం కన్నేపల్లి గ్రామ శివారులో తాతల నుండి వారసత్వంగా వస్తున్న భూమి ఉందని, విరాసత్ చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. నస్పూర్ మండలం తీగల్ పహాడ్ గ్రామానికి చెందిన పుప్పాల నారాయణ తాను 1985 లో రిజిస్ట్రేషన్ ద్వారా భూమిని పొందానని, ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ లో సర్వేనెంబర్ తప్పుగా చూపుతుందని, సవరించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ. ప్రజావాణిలో అందిన ప్రతి దరఖాస్తులు క్షుణ్ణంగా పరిశీలించి అధికారుల సమన్వయంతో పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Post bottom