Telugu Updates
Logo
mobile after logo

ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి

జిల్లా పాలనాధికారి బదావత్ సంతోష్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లా ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజావాణి కార్యక్రమం ద్వారా సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో కృషి చేయడం జరుగుతుందని జిల్లా పాలనాధికారి బదావత్ సంతోష్ అన్నారు. సోమవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. రాహుల్ తో కలిసి అర్జీదారుల నుండి దరఖాస్తులను స్వీకరించారు. జీప్స్, టాటా మ్యాజిక్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు ఎన్. సమ్మయ్య, జి. మల్లేష్ లు ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం కారణంగా తమకు ఉపాధి లేకుండా పోయిందని, తమకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించాలని, జీవన భృతి ఇవ్వాలని, జీవిత బీమా సౌకర్యం కల్పించాలని, లైట్ మోటార్ టాక్సీ వెహికల్ ఫిట్నెస్ చలానా మాఫీ చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. కోటపల్లి మండలం సిర్స గ్రామానికి చెందిన ధర్ని లస్మక్క తన భర్త పేరిట గ్రామ శివారు నందు పట్టా భూమి ఉందని, ఆయన మరణించినందున ఇట్టి భూమిని తన పేరిట విరాసత్ పట్టా చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు. బెల్లంపల్లి పట్టణంలోని అశోక్ నగర్ కు చెందిన ఆంథోనీదాస్ తన తండ్రి ఆర్మీలో పని చేసినందున ప్రభుత్వం అందించిన భూమిని గత సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నామని, ఇట్టి భూమిని తన పేరిట ఆన్లైన్ లో నమోదు చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. లక్షెట్టిపేట మండలం జెండా వెంకటాపూర్ గ్రామానికి చెందిన నల్మాస్ లక్ష్మీనారాయణ తనకు గ్రామ శివారు నందు గల పట్టా భూమికి సంబంధించి పట్టా పాస్ బుక్ వివరాల సవరణ కొరకు టి.ఎం.33లో చేసుకున్న దరఖాస్తులు పరిశీలించాలని కోరుతూ అర్జీ సమర్పించారు. మందమర్రి మండలం క్యాతనపల్లి గ్రామానికి చెందిన మెరుగు రాజం తమకు గ్రామ శివారులో భూమి ఉందని, ఇట్టి భూమి ధరణి లో ఇండ్ల స్థలాలుగా చూపిస్తుందని, ఈ పొరపాటును సవరించి వారి పేరిట ఆన్ లైన్ లో నమోదు చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు. మంచిర్యాల పట్టణానికి చెందిన తౌటం నారాయణ మందమర్రి మండలం అందుగులపేట శివారులో గల తన భూమికి సంబంధించి కోర్టులో కేసు కొనసాగుతుందని, ఇట్టి భూమిపై ఎలాంటి లావాదేవీలు జరగకుండా నిలుపుదల చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. యువ కళా సమితి సాహితీ సంస్కృతి సంస్థ ప్రతినిధులు తమ దరఖాస్తులో రంగస్థల కళాకారులు, సాహితీవేత్తలు, నృత్య కళాకారులు, జానపద కళాకారులకు నిలయమైన మంచిర్యాల జిల్లాలో ఒక కళావేదిక నిర్మాణానికి సహకరించి స్థలం కేటాయించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు.

కోటపల్లి మండలం దేవులవాడ గ్రామానికి చెందిన కోరట్ల రవీందర్ రెడ్డి తనకు గ్రామ శివారులో గల భూమికి సంబంధించి లావాదేవీలు చేసుకొనుటకు కోర్టు నుండి ఆర్డర్ అయి ఉన్నందున ఇట్టి భూమిని బ్లాక్ నుండి తొలగించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. మందమర్రి పట్టణం 2వ జోన్ కు చెందిన ఎం. డి. అంకుషావలి పుట్టుకతో దివ్యాంగుడైన తాను పెద్ద పనులు చేయలేనని, తన కుటుంబాన్ని పోషించుకునేందుకు తనకు ఉపాధి కల్పించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ. ప్రజావాణిలో అందిన ప్రతి దరఖాస్తులు క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత శాఖల సమన్వయంతో పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Post bottom