
ఎమ్మెల్యే చిన్నయ్య బేషరతుగా క్షమాపణ చెప్పాలి.
దేశ, రాష్ట్ర, ప్రజా ప్రయోజనాలకే కమ్యూనిష్టు పోరాటం
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అహాంకార వైఖరితో అనుచిత వాఖ్యలు చేయడం సరికాదని, చేసిన వాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకొని భారత కమ్యూనిష్టు పార్టీకి క్షమాపణ చెప్పాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్, బెల్లంపల్లి నియోజకవర్గ కార్యదర్శి రేగుంట చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ. బెల్లంపల్లి నియోజకవర్గంలో సిపిఐ పార్టీకి వేయ్యి ఓట్లు రావని బెల్లంపల్లి ఎంఎల్ఎ దుర్గం చిన్నయ్య అనడం హాస్యస్పదం అని, నియోజకవర్గం ఏర్పడిన అనంతరం మొట్టమొదటి ఎమ్మెల్యే కీశే॥ గుండా మల్లేష్ అని, ఈ ప్రాంతం నుండి 4 సార్లు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించిన చరిత్ర కమ్యూనిష్టు పార్టీకి ఉందని, సిపిఐ నుండి ఎమ్మెల్యే గా గెలుపొందిన గౌరవ మల్లేష్ వ్యక్తిగత ప్రయోజనాలకు కాకుండా దేశ, రాష్ట్ర, ప్రజల ప్రయోజనాల కోసం పని చేశారని, ఆయన ఇక్కడ ప్రజల గుండెల్లో స్థానాన్ని సంపాదించుకున్నారని, దుర్గం చిన్నయ్య వ్యక్తిగత ప్రయోజనాలకు పని చేస్తూ ఆస్తులు కూడబెట్టుకున్నారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ఏర్పాటుకు గల్లీ నుండి ఢిల్లీ కి ప్రజల గొంతు వినిపించి శ్రీకృష్ణ కమిటికి నివేదిక తెలంగాణకు అనుకూలంగా నివేదిక అందించిన వారిలో కమ్యూనిష్టులు ముందున్నారని, ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుని అధికారాన్ని సాధించిన వారికి అవగాహన లేకుండా పోయిందని అన్నారు. చేసిన వాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని లేకుంటే భారత కమ్యూనిష్టు పార్టీ తగిన రీతిలో బుద్ది చెప్తుందని హెచ్చరించారు.
ఈ కార్యక్రమం లో సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, బెల్లంపల్లి నియోజకవర్గ కార్యదర్శి రేగుంట చంద్రశేఖర్, జిల్లా నాయకులు మేకల దాసు, మిట్టపల్లి వెంకటస్వామి, దాగం మల్లేష్, మిట్టపల్లి శ్రీనివాస్, చిప్ప నర్సయ్య, జోగుల మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.


