ఆలయాలు, మత్స్య రంగానికి భారీ అభివృద్ధి
ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మంచిర్యాల నియోజకవర్గానికి అభివృద్ధి దిశగా కీలక అడుగులు పడుతున్నాయని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. గురువారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన, దేశంలోనే మొట్టమొదటి ఇంటర్నేషనల్ ఫిష్ పాండ్ మన ప్రాంతానికే రావడం గొప్ప విషయం అని పేర్కొన్నారు. దీని ద్వారా మత్స్య సంపద అభివృద్ధికి విశాల అవకాశాలు కలుగుతాయని, చేపల విత్తన ఉత్పత్తి ఇక్కడే జరుగుతుందని వెల్లడించారు. రాష్ట్రంలోని చెరువులకు అవసరమైన మత్స్య విత్తనాలను ఇక్కడి నుంచే సరఫరా చేయనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ఆమోదం లభించిందని చెప్పారు. దండేపల్లి మండలం గూడెం గ్రామంలోని గూడెం సత్యనారాయణ స్వామి ఆలయంను రూ.70 కోట్లతో అభివృద్ధి చేసి “రెండవ అన్నవరం”గా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. పుష్కరాల కంటే ముందే పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. గూడెం పైప్‌లైన్ మరమ్మత్తులు చేపట్టి, నీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. అలాగే పుష్కరాల సందర్భంగా మంచిర్యాల పట్టణంలోని విశ్వనాథ ఆలయంకు రూ.10 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆలస్యంగా అయినా ప్రారంభించామని, రైతులకు సరిపడ విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. ప్రతిపక్షాల ఆరోపణలను ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారికి, రాష్ట్ర మంత్రివర్గానికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో మేయర్ ధరణి మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య-మహేష్, కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు, మహిళా మరియు యువజన కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.


