• కాలినడకన 6 కిమీ నడిచి పంటలను పరిశీలించిన కలెక్టర్ రాజర్షి షా
• విద్యుత్ శాఖ నిర్లక్ష్యంపై ఆగ్రహం – నష్టపరిహారం అందిస్తామన్న హామీ

ఆంజనేయులు న్యూస్, ఆదిలాబాద్ జిల్లా, బోథ్ మండలం (కనుగుట్ట గ్రామం): అగ్ని ప్రమాదంతో కాలిపోయిన మొక్కజొన్న, జొన్న పంట పొలాలను జిల్లా కలెక్టర్ రాజర్షి షా మంగళవారం సాయంత్రం పరిశీలించారు. సుమారు 6 కిలోమీటర్లు కాలినడకన వెళ్లి రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అధికారుల రికార్డుల ప్రకారం, ఈ ప్రమాదంలో 29 మంది రైతులకు చెందిన పంటలు కాలిపోవడంతో సుమారు రూ.48 లక్షల నష్టం సంభవించినట్లు తెలిపారు. సంఘటన స్థలంలో రైతులను అడిగి పూర్తి వివరాలు సేకరించిన కలెక్టర్, తహసీల్దార్ సుభాష్ చంద్రకు సమగ్ర నివేదిక పంపించాలని ఆదేశించారు. పొలాల మధ్యగా వెళ్తూ వేలాడుతున్న విద్యుత్ తీగలను గమనించిన కలెక్టర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నాలుగు సంవత్సరాల క్రితం డీడీలు కట్టినా ఇప్పటికీ విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయలేదని రైతులు ఫిర్యాదు చేయగా, సంబంధిత అధికారులను ప్రశ్నించారు. “ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా నా దృష్టికి తీసుకురండి… పాత డీడీల వివరాలు పంపించండి” అని రైతులకు సూచించారు. అగ్ని ప్రమాదంలో పైపులు కూడా కాలిపోయినట్లు రైతులు తెలపడంతో, హార్టికల్చర్ శాఖ ద్వారా సహాయం అందించే ప్రయత్నం చేస్తామని కలెక్టర్ తెలిపారు. గ్రామ మాజీ ఎంపీటీసీ ఆకుల రాజేందర్ తెలిపిన విద్యుత్ సమస్యలపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. పరిశీలన అనంతరం తిరిగి వెళ్తుండగా మహిళా రైతులు కలెక్టర్‌ను అడ్డుకుని కన్నీటి పర్యంతమయ్యారు. “బాధపడకండి… మీకు న్యాయం జరిగేలా చూస్తాం” అని కలెక్టర్ వారికి హామీ ఇచ్చారు.

ఈ ఘటనపై పూర్తి నివేదికను ప్రభుత్వానికి పంపించి, నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ చిత్రు, ఆర్డీఓ విద్యాసాగర్ రావు, తహసీల్దార్ సుభాష్ చంద్ర, విద్యుత్ శాఖ అధికారులు ఏడి లక్ష్మణ్, ఏఈ శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.


