
అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని పరామర్శిస్తున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి
12 మంది పిల్లలు, ఓ ఉపాధ్యాయురాలికి గాయాలు
గాంధీ సినిమా ప్రదర్శిస్తున్న హైదరాబాద్ ఆర్కే సినీప్లెక్స్ లో ఘటన
హైదరాబాద్: స్వతంత్ర భారత వజోత్సవాల్లో భాగంగా ప్రదర్శిస్తున్న ‘గాంధీ’ చిత్రాన్ని వీక్షించేందుకు వచ్చిన విద్యార్థులు ఎస్కలేటర్ దిగుతూ పడిపోయి గాయపడిన ఘటన హైదరాబాద్ లో కలకలానికి కారణమైంది. ఈ ఘటనలో ఓ ఉపాధ్యాయురాలూ గాయపడ్డారు. జూబ్లీహిల్స్ భారతీయ విద్యా భవన్స్ పబ్లిక్ స్కూల్ కు చెందిన విద్యార్థులు ‘గాంధీ’ చిత్రాన్ని వీక్షించేందుకు గురువారం ఉదయం హైదరాబాద్ బంజారాహిల్స్ లోనీ పీవీఆర్ ఆర్కె సినీఫ్లెక్స్ కు వచ్చారు. ఎస్కలేటర్ ఎక్కి పైకి వెళ్లారు. దాన్నుంచి దిగే సమయంలో తరబాటుకు గురై 12 మంది విద్యార్థులు కిందపడి గాయపడ్డారు. వాళ్ల వెంట ఉన్న ఉపాధ్యాయురాలు కూడా గాయాలపాలయ్యారు. వారిని పాఠశాల సిబ్బంది జూబ్లీహిల్స్ లోనీ అపోలో ఆసుపత్రికి తరలించారు.
ప్రాథమిక చికిత్స అనంతరం ఉపాధ్యాయురాలితోపాటు 8 మంది విద్యార్థులను డిశ్ఛార్జి చేసినట్లు, శస్త్రచికిత్స చేయాల్సి రావడంతో నలుగుర్ని (అభినవ్, తరుణ్, హాసిని, క్రితిన్) ఆసుపత్రిలోనే ఉంచినట్టు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. బాధిత విద్యార్థులను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పరామర్శించారు.


