
మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: నేరాల నియంత్రణలో సి.సి. కెమెరాల పాత్ర కీలకమైనదని, నేరస్తులను గుర్తించడంలో, కేసుల సత్వర పరిష్కారంలో ఎంతగానో దోహదపడతాయని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. శుక్రవారం మంచిర్యాల పట్టణంలోని 24 వార్డులో 4 లక్షల 25 వేల రూపాయల వ్యయంతో ఏర్పాటు 34 కెమెరాలను పోలీస్ స్టేషన్ కమాండ్ కంట్రోల్ రూమ్ డి.సి.పి. అఖిల్ మహాజన్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సి.సి. కెమెరాల ఏర్పాటుతో వార్డులో అవాంఛనీయ ఘటనలు జరిగినప్పుడు పరిష్కారం సులభతరమవుతుందని, నేరస్తులను గుర్తించడం తేలిక అవుతుందని తెలిపారు. 24వ వార్డులోని రెడ్డికాలనీ, సెవెన్ హెల్స్ స్కూల్ ఏరియా, హనుమాన్ నగర్ లో ఏర్పాటు 34 సి.సి. కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగిందని, వీటి ఏర్పాటుకు వార్డులోని దాతలు విరాళంగా 5 లక్షల 33 వేల రూపాయలు అందించడం అభినందనీయమని, మిగిలిన నగదుతో రోడ్డు నంబర్లు తెలిపే సూచికల ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎ.సి.పి. తిరుపతిరెడ్డి, సి.ఐ. నారాయణ, వార్డు కౌన్సిలర్ వేములపల్లి సంజీవ్, కాలనీ వాసులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.


