జిల్లాలో పత్తి కొనుగోలు కేంద్రాల ద్వారా మద్దతు ధర చెల్లించి రైతుల నుండి నాణ్యమైన పత్తి కొనుగోలు చేయడం జరుగుతుంది.
మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: రైతుల సౌకర్యార్థం జిల్లాలో పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగిందని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలో గల కలెక్టర్ చాంబర్ లో జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ తో కలిసి జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ. జిల్లాలో పత్తి కొనుగోలు కేంద్రాల ద్వారా మద్దతు ధర చెల్లించి రైతుల నుండి నాణ్యమైన పత్తి కొనుగోలు చేయడం జరుగుతుందని, గురువారం జిల్లాలోని బెల్లంపల్లి, తాండూర్ లలో 8 వేల100 రూపాయల మద్దతు ధరతో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగిందని తెలిపారు. 2022-23 సంవత్సరానికి గాను జిల్లాలో 1 లక్షా 54 వేల 853 ఎకరాలలో దాదాపు 15 లక్షల క్వింటాళ్ళ పత్తి సాగు జరుగుతుందని తెలిపారు. జిల్లాలో 7 పత్తి కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుండి పత్తి కొనుగోలు చేయడం జరుగుతుందని, మిగతా 5 కేంద్రాలలో సోమ, మంగళ వారాలలో కొనుగోళ్ళు ప్రారంభిస్తామని తెలిపారు. వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వారా మంచిర్యాల, లక్షెట్టిపేట, చెన్నూర్, బెల్లంపల్లి, జన్నారం లలోని కొనుగోలు కేంద్రాల ద్వారా 6 వేల 380 రూపాయల మద్దతు ధర చెల్లించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలోని జిన్నింగ్ మిల్లులు రోజుకు 2. వేల 750 బేళ్ళ సామర్థ్యం కలిగి ఉన్నాయని తెలిపారు. పత్తి కొనుగోలు చేయు సమయంలో తేమ శాతం 8 నుండి 12 శాతం లోపు ఉంటే కొనుగోలు చేయడం జరుగుతుందని, తేమ శాతాన్ని బట్టి ధర ఉంటుందని, 6, 7 శాతం ఉంటే బోనస్ చెల్లించడం జరుగుతుందని తెలిపారు. కొనుగోలు కేంద్రాలలో రైతుల నుండి పత్తి కొనుగోలు చేయు సమయంలో తేమ శాతం, బరువు కొలిచే యంత్రాలు, పరికరాలు, వివరాల నమోదుకు కంప్యూటర్లు, వేబ్రిడ్జ్ అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని, కేంద్రాలకు వచ్చే రైతులకు త్రాగునీరు, నీడ ఇతరత్రా మౌళిక సదుపాయాలు కల్పించాలని తెలిపారు. కొనుగోలు సమయంలో రైతులకు రశీదులు తప్పనిసరిగా ఇవ్వాలని, చెల్లింపులు క్రమం తప్పకుండా చేయాలని ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో తగు రక్షణ ఏర్పాట్లు పర్యవేక్షించి మిల్లలకు తగు సూచనలు చేయాలని తెలిపారు. జిన్నింగ్ మిల్లులలో తూనికలు, కొలతల శాఖ ద్వారా వేబ్రిడ్జ్, అవసరమైన ధృవపత్రాలు పరిశీలించాలని సూచించారు. రైతులు తేమ శాతం నిబంధనలు పాటిస్తూ నాణ్యమైన పత్తిని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించేలా వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు రైతులు, కొనుగోలు చేసిన పత్తి వివరాలను పూర్తి స్థాయిలో నమోదు చేసి చెల్లింపుల ప్రక్రియ చేయాలని తెలిపారు. సి.సి.ఐ. ద్వారా పత్తి కొనుగోలు చేసేందుకు తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి కల్పన, మార్కెటింగ్ అధికారి గజానంద్, జిన్నింగ్ మిల్లుల యజమానులు, మార్కెట్ కమిటీ కార్యదర్శులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

