ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో అవమానమే కారణమా?
రెండు రోజుల్లో భవిష్యత్ కార్యాచరణపై ప్రకటన
భద్రాద్రి అక్టోబర్ 6, ( ఆంజనేయులు న్యూస్ )
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీఆర్ఎస్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మంగళవారం ఆయన ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నిర్వహించిన సన్నాహక సమావేశంలో తనను వేదికపైకి ఆహ్వానించకపోవడంపై తాటి వెంకటేశ్వర్లు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. పార్టీ కార్యక్రమాల్లో తనకు తగిన గౌరవం, ప్రాధాన్యం దక్కడం లేదనే అసంతృప్తితోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే రాజీనామాకు కారణాలపై ఆయన చేసిన వ్యాఖ్యలనే అధికారికంగా పరిగణించాల్సి ఉంటుంది. రెండు రోజుల్లో తన అనుచరులతో సమావేశమై చర్చించిన అనంతరం భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని తాటి వెంకటేశ్వర్లు తెలిపారు. దీంతో ఆయన తదుపరి రాజకీయ అడుగుపై భద్రాద్రి జిల్లా రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
