మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ పద్ధతి మార్చుకోవాలి: అనుచరుల హెచ్చరిక
మంచిర్యాల అక్టోబర్ 6, ( ఆంజనేయులు న్యూస్ )
మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ తమ పద్ధతిని మార్చుకోవాలని, లేనిపక్షంలో మంతెన జగన్మోహన్రావు వర్గాన్ని కాంగ్రెస్ నుంచి బహిష్కరించేలా అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తామని ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు వర్గీయులు హెచ్చరించారు. మంగళవారం ఎమ్మెల్యే నివాసంలో మేయర్ మధుకర్, మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు తూముల నరేష్, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు పూదరి తిరుపతి మీడియాతో మాట్లాడారు. ప్రేమ్‌సాగర్‌రావు చేస్తున్న అభివృద్ధిని జీర్ణించుకోలేకే వర్గపోరుకు తెరలేపుతున్నారని వారు ఆరోపించారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర పీసీసీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఎంపీ ల్యాడ్స్ నిధులను అన్ని డివిజన్లకు సమానంగా కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్పొరేషన్ కార్యక్రమాల ఫ్లెక్సీల్లో మేయర్, డిప్యూటీ మేయర్, ఏఎంసీ చైర్మన్ ఫొటోలు పెట్టకపోవడం అభ్యంతరకరమన్నారు. కాంగ్రెస్ అధికారంలో లేని పదేళ్లలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పార్టీని బలోపేతం చేయడంలో ప్రేమ్‌సాగర్‌రావు కీలకపాత్ర పోషించారని పేర్కొన్నారు. ఆయనను నేరుగా ఎదుర్కోలేకే కొందరు వర్గ రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. మంచిర్యాల అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రేమ్‌సాగర్‌రావుకు మంత్రి పదవి ఇవ్వాలని అధిష్ఠానాన్ని డిమాండ్ చేశారు.
