హైదరాబాద్ నవంబర్ 21, ( ఆంజనేయులు న్యూస్ )
హైదరాబాద్‌లో డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతామని నగర నూతన పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ హెచ్చరించారు. డ్రగ్స్ విక్రయాలు, సరఫరా, స్మగ్లింగ్‌కు పాల్పడే ముఠాలపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కేవలం నిందితులను అరెస్టు చేయడమే కాకుండా, డ్రగ్స్ వ్యాపారంతో సంబంధం ఉన్న ఆస్తులను సైతం చట్టప్రకారం స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. డ్రగ్స్ సరఫరాకు ఉపయోగించే భవనాలను కూడా సీజ్ చేస్తామని వెల్లడించారు. నగరంలో డ్రగ్స్, సైబర్ నేరాలు, మొబైల్ ఫోన్ స్నాచింగ్, రౌడీషీటర్లకు సంబంధించిన హత్యలు ప్రధాన సవాళ్లుగా ఉన్నాయని సీపీ పేర్కొన్నారు. ఈ నేరాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపడతామని తెలిపారు. పదేపదే నేరాలకు పాల్పడే వారిపై ఎక్స్టర్న్మెంట్, పీడీ యాక్ట్ వంటి చట్టాలను ప్రయోగిస్తామని హెచ్చరించారు. డ్రగ్స్ సరఫరా వెనుక ఉన్న ముఠాల నెట్‌వర్క్‌ను మూలాల నుంచి ఛేదిస్తామని, పెడ్లర్లు, స్మగ్లర్లపై ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. డ్రగ్స్‌కు తొలిసారిగా అలవాటుపడి, వాటిని మానుకోవాలనుకునే వారికి కౌన్సెలింగ్, డీ-అడిక్షన్ ద్వారా సహకరిస్తామని తెలిపారు. యువత భవిష్యత్తును దెబ్బతీస్తున్న డ్రగ్స్ మహమ్మారిని అరికట్టేందుకు ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలని సీపీ కోరారు. తమ పరిసరాల్లో డ్రగ్స్ విక్రయాలు, సరఫరా లేదా అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో 100 లేదా 112 నంబర్లకు ఫోన్ చేయాలని తెలిపారు. చట్టాన్ని గౌరవించే ప్రజలకు పోలీసులు అండగా ఉంటారని, నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని మహేష్ భగవత్ స్పష్టం చేశారు.
