మంచిర్యాల సెప్టెంబర్ 23, ( ఆంజనేయులు న్యూస్ )
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సాంస్కృతిక సారథి కళాకారులు ఆటపాటలతో కార్యక్రమం నిర్వహించారు. బుధవారం జిల్లా సమాచార, పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం సోమగూడెం గ్రామంలో ఈ కార్యక్రమం జరిగింది. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు పాటలు, నృత్యాలు, ప్రదర్శనల ద్వారా ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. అర్హులైన పేదలకు ప్రభుత్వ పథకాలు ఎలాంటి మధ్యవర్తులు, దళారుల ప్రమేయం లేకుండా ప్రజా పాలన ద్వారా నేరుగా చేరేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్, రైతు భరోసా, యువ వికాసం తదితర పథకాల గురించి కళాకారులు ప్రజలకు అవగాహన కల్పించారు. అలాగే సీజనల్‌గా వచ్చే వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు ముల్కల్ల మురళి, లావుడ్యా రమేష్, మామిండ్ల లచ్చన్న, వెళ్తూరు పోశం, గొడిసెల కృష్ణ, మిట్టపల్లి సంధ్య, చేగొండ నిరోష, తస్లీమా, కుదాది సోమశేఖర్‌తో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
