హన్మకొండ, నవంబర్ 13, ( ఆంజనేయులు న్యూస్ )
చిన్నారుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను, కళా నైపుణ్యాలను వెలికితీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని ఉభయ తెలుగు రాష్ట్రాల కళాకారుల సంక్షేమ మండలి అధ్యక్షులు, కేంద్ర ఖాదీ మరియు చిన్న పరిశ్రమల పూర్వ డైరెక్టర్ ఈగ మల్లేశం అన్నారు. హన్మకొండ పట్టణంలోని బాలసముద్రం ఎన్టీఆర్ ప్రాంగణంలో జే.బి. కల్చరల్ ఆర్ట్స్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సకల కళల సంబరాల జాతరలో భాగంగా, చాచా నెహ్రూ జయంతి, బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 15న పబ్లిక్ గార్డెన్‌లోని పద్మశ్రీ డా. నేరెళ్ల వేణుమాధవ్ కళా ప్రాంగణంలో నిర్వహించనున్న ఓరుగల్లు చిల్డ్రన్స్ అవార్డు–2026 పోస్టర్‌ను గురువారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఈగ మల్లేశం మాట్లాడుతూ.. నేటి బాలలే రేపటి కళాకారులని, చిన్నారుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించేందుకు ఇలాంటి వేదికలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. గత 23 ఏళ్లుగా నిరంతరాయంగా బాలల దినోత్సవ వేడుకలు నిర్వహిస్తూ చిన్నారులను ప్రోత్సహిస్తున్న సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు జడల శివ కృషి అభినందనీయమన్నారు. ఈ నెల 15న జరిగే వేడుకల్లో బాలబాలికలు అధిక సంఖ్యలో పాల్గొని తమ ప్రతిభను చాటుకోవాలని పిలుపునిచ్చారు. ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ వేడుకలు వైభవంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బాలబాలికలు, గురువులు, తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో భాగస్వాములై వేడుకలను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడల శివ, హరిత, ఎం. చంద్రమౌళి, హిందీ శ్యామ్, పి. భుజంగరావు, పిట్టల జ్యోత్స్న, రాయబారపు ప్రసాద్, ఎం. చందన, సంపత్ రావు, సంపత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
