మంచిర్యాల సెప్టెంబర్ 23, ( ఆంజనేయులు న్యూస్ )
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు జిల్లా కలెక్టర్ శ్రీ చంద్రయ్య ఐఏఎస్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్, ఆర్ఎంవో డాక్టర్ శ్రీధర్తో కలిసి ఆయుర్వేద వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అదనపు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. “ఆరోగ్యకరమైన భవిష్యత్తు ఆయుర్వేదంతో” అనే నినాదంతో జిల్లాలో ప్రజలకు ఆయుర్వేదంపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని ఆయుర్వేద ఆసుపత్రుల ద్వారా ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుత జీవనశైలి మార్పుల కారణంగా పెరుగుతున్న అసంక్రమణ వ్యాధులు, బీపీ, షుగర్, కొన్ని రకాల క్యాన్సర్లు, జీర్ణాశయ సంబంధిత సమస్యలు తదితర వాటి విషయంలో ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని పాటించడం ఎంతో ముఖ్యమని అధికారులు తెలిపారు. ఆరోగ్యకరమైన, పౌష్టికాహారం తీసుకోవడం, క్రమబద్ధమైన జీవనశైలిని అలవర్చుకోవడం, వ్యాయామం, యోగా, ధ్యానం చేయడం, మంచి అలవాట్లను పాటించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సూచించారు. మన చుట్టూ అందుబాటులో ఉండే ప్రకృతి వనరులతో ఆరోగ్యాన్ని కాపాడుకునే విధానాలను మన పూర్వీకులు, ఋషులు అందించారని, ఆయుర్వేదాన్ని పరిరక్షించుకుంటూ దాని ప్రయోజనాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. ఆయుర్వేద వైద్యుల సలహాలు, సూచనల మేరకు వైద్య సేవలను పొందాలని కోరారు. జిల్లాలో 12 ఆయుర్వేద ఆసుపత్రుల ద్వారా వైద్య సేవలు అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అల్లోపతి వైద్యంతో పాటు అవసరమైన సందర్భాల్లో ఆయుర్వేద వైద్య విధానాన్ని కూడా వైద్యుల సూచనల మేరకు వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు. ముఖ్యంగా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, వృద్ధులు, చిన్నారుల విషయంలో వైద్యుల సలహాలు తీసుకోవడం ద్వారా తగిన విధంగా వైద్య సేవలు పొందాలని సూచించారు. ఈ సందర్భంగా సదరం క్యాంపునకు సికిల్ సెల్ ఎనీమియా పరీక్షల కోసం వచ్చిన వారికి, వారి తల్లిదండ్రులకు ఆయుర్వేద వైద్యం, ఆరోగ్యకరమైన జీవన విధానంపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, అల్లాడి శ్రీనివాస్, సబ్ యూనిట్ అధికారి శ్రీనివాస్, జిల్లా ఆయుర్వేద వైద్యాధికారి డాక్టర్ నీరజ, జిల్లా ప్రోగ్రాం అధికారి రవీందర్ రాథోడ్, వైద్యులు డాక్టర్ సంజయ్, డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ శృతి, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, ఆరోగ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
