
మంచిర్యాల, అక్టోబర్ 29, ( ఆంజనేయులు న్యూస్ )
జిల్లాలో క్షయ వ్యాధిని పూర్తిస్థాయిలో నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందడుగు వేయాలని జిల్లా కలెక్టర్ కె.హరిత పిలుపునిచ్చారు. క్షయ వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించి, వైద్యుల సూచనల మేరకు ఆరు నెలల పాటు క్రమం తప్పకుండా మందులు తీసుకోవడంతో పాటు పోషకాహారం తీసుకుంటే వ్యాధిని నయం చేయవచ్చని తెలిపారు. గురువారం కెరమెరి మండలం దేవాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని కొలాంగూడ గ్రామంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమగ్ర ఆరోగ్య పరీక్షల శిబిరాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నాగేంద్రతో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్షయ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించకపోతే ఇతరులకు వ్యాపించే ప్రమాదం ఉందని, లక్షణాలు ఉన్నవారు తప్పనిసరిగా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. క్షయ వ్యాధి నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి జన్‌మన్ పథకం కింద అర్హులైనప్పటికీ కొందరికి ఇళ్లు మంజూరు కాలేదని గ్రామస్థులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, స్పందించిన ఆమె అర్హులైన ప్రతి ఒక్కరికీ నిబంధనల ప్రకారం ఇళ్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిర్ణీత విస్తీర్ణంలో నాణ్యతా ప్రమాణాలతో ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. అనంతరం గ్రామంలోని టి.డబ్ల్యూ.పి.ఎస్ పాఠశాలను సందర్శించి విద్యార్థుల హాజరు వివరాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. చిన్నారులకు చాక్లెట్లు అందించారు. అంతకుముందు క్షయ వ్యాధి నిర్మూలన ప్రచార వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేసి గిరిజన గ్రామాలను క్షయ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం అధికారి వినయ్‌కుమార్, కొలాంగూడ సర్పంచ్ కుమ్రంభీం రావు, ఉపసర్పంచ్ బారిక్ రావు, వైద్యులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
