గ్రామసభలు నిర్వహించకుండానే అవార్డుల అమలుపై ఆందోళన.. ఎన్‌హెచ్‌ఏఐ కార్యాలయం ఎదుట ధర్నా
మంచిర్యాల అక్టోబర్ 29, ( ఆంజనేయులు న్యూస్ )
నేషనల్ హైవే-63 భూసేకరణ వ్యవహారంలో తమకు అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తూ బాధిత రైతులు గురువారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎన్‌హెచ్‌ఏఐ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గ్రామసభలు నిర్వహించకుండా అవార్డులు అమలు చేయడంపై నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఎన్‌హెచ్‌ఏఐ పీడీ అజయ్ మణికుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకుడు తులా మధుసూదన్ రావు మాట్లాడుతూ.. నేషనల్ హైవే-63 అలైన్‌మెంట్ మార్పు విషయంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. అలైన్‌మెంట్ మార్పుపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టలేదని, గ్రామసభలు నిర్వహించలేదని అన్నారు. అవార్డులు పాస్ చేసే సమయంలోనూ గ్రామసభలు నిర్వహించకుండా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు నివేదికలు పంపడం చట్టవిరుద్ధమని విమర్శించారు. నోటీసులు ఇచ్చి సంతకాలు సేకరించడాన్నే ప్రజాభిప్రాయ సేకరణగా చూపుతూ కేంద్ర ప్రభుత్వానికి తప్పుడు సమాచారం అందించారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన, రైతు ప్రభుత్వమని చెబుతూనే మరోవైపు రైతుల భూముల విషయంలో వారికి అన్యాయం చేస్తోందని మధుసూదన్ రావు విమర్శించారు. రాజ్యాంగబద్ధమైన విధానాలను, చట్టపరమైన ప్రక్రియలను పాటించకుండా అవార్డులు అమలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు పంపిన అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులను కోరారు. రైతులు మాట్లాడుతూ.. భూసేకరణకు సంబంధించిన కేసు హైకోర్టులో విచారణలో ఉండగానే అధికారులు అవార్డులు పాస్ చేయడం, తదుపరి చర్యలకు ఉపక్రమించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. నవంబర్ 16న హైకోర్టులో కేసు విచారణ ఉన్నందున అప్పటివరకు రైతులకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు చేపట్టవద్దని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పంపుతున్న నివేదికలను ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని కోరారు. భూసేకరణ ప్రక్రియలో పారదర్శకత పాటించాలని, రైతుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రస్థాయిలో సానుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రి రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ విభేదాలకు ప్రాధాన్యమిస్తూ తమ సమస్యలను విస్మరిస్తున్నారని విమర్శించారు. రైతులకు అన్యాయం చేసిన పాలకులు, నాయకులు ప్రజల ఆదరణ కోల్పోతారని పేర్కొంటూ ఇప్పటికైనా తమకు న్యాయం జరిగేలా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించాలని కోరారు. భూసేకరణలో నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడిన అధికారులపై విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో బీజేపీ సీనియర్ నాయకుడు తులా మధుసూదన్ రావుతో పాటు రైతులు లెగిశెట్టి రాజమౌళి, వొడ్నాల శ్యాంసుందర్, పరమేష్, దాస్య నాయక్, సాంబారు తిరుపతి, కస్తూరి మల్లేష్, సీహెచ్ జగన్, శ్రీనివాస్, లింగయ్య, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
