మంచిర్యాల సెప్టెంబర్ 2, ( ఆంజనేయులు న్యూస్ )
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రావు బుధవారం వెంకట్రావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు ఇటిక్యాల ఉపకేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి వైద్య సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఇటిక్యాల ఉపకేంద్రంలో మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ మౌనిక, ఆరోగ్య కార్యకర్త విజయదర్శినితో ఉపకేంద్రంలో అందుతున్న వైద్య సేవలపై డీఎంహెచ్ఓ వివరాలు తెలుసుకున్నారు. ముఖ్యంగా వ్యాక్సినేషన్ కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. గర్భిణులు, చిన్నారులకు అందిస్తున్న టీకాల వివరాలను పరిశీలించారు. ప్రతి వ్యాక్సినేషన్ కార్యక్రమానికి ముందుగానే గర్భిణులు, పిల్లల వివరాలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ఆశా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి అర్హులను గుర్తించి వారికి అవగాహన కల్పిస్తూ వ్యాక్సినేషన్ చేయించాలని ఆదేశించారు. అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను 100 శాతం పూర్తి చేయడంతో పాటు రోజువారీ వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని డీఎంహెచ్ఓ సూచించారు. ముఖ్యంగా వ్యాక్సినేషన్ వివరాలను యూవిన్ పోర్టల్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని తెలిపారు. వివరాలు యూవిన్ పోర్టల్‌లో నమోదు చేయకపోతే వ్యాక్సినేషన్ రికార్డు సక్రమంగా నమోదు కాదని పేర్కొన్నారు. క్షయ వ్యాధి నియంత్రణలో భాగంగా వ్యాధిగ్రస్తులను గుర్తించడం, పరీక్షలు నిర్వహించడం, మందులు అందించడం, ప్రజలకు అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలను సమర్థవంతంగా చేపట్టాలని ఆదేశించారు. 14 సంవత్సరాలు నిండిన బాలికలందరికీ హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ అందేలా చర్యలు తీసుకోవాలని, హెచ్‌పీవీ వ్యాక్సిన్‌తో క్యాన్సర్ నివారణపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఉపకేంద్రంలో సిబ్బంది అందుబాటులో ఉంటూ సమయపాలన పాటించాలని, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్ఓ హెచ్చరించారు. అనంతరం వెంకట్రావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన డాక్టర్ నరేందర్ రావు వైద్యాధికారి డాక్టర్ సమత, వైద్య సిబ్బంది, నర్సింగ్ అధికారులు, ఆరోగ్య కార్యకర్తలు, సూపర్వైజర్లతో ఆరోగ్య కార్యక్రమాల అమలుపై సమీక్ష నిర్వహించారు. అన్ని ఆరోగ్య కార్యక్రమాల వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని ఆదేశించారు. పీహెచ్‌సీలోని ల్యాబ్, మందుల నిల్వ గది, ఓపీ, ఇన్‌పేషెంట్ గదులను తనిఖీ చేశారు. ఆసుపత్రిలో పరిశుభ్రతను పాటించాలని సూచించారు. వనమహోత్సవంలో భాగంగా పీహెచ్సీ ఆవరణలో మొక్కలు నాటడాన్ని అభినందించి, వాటిని సంరక్షించాలని కోరారు. పీహెచ్సీలో అందిస్తున్న వైద్య సేవలపై డీఎంహెచ్ఓ సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైద్య ఆరోగ్యశాఖతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామపంచాయతీ, మున్సిపల్, ఐసీడీఎస్, విద్యాశాఖలతో సమన్వయం చేసుకుని ఆరోగ్య కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేయాలని డాక్టర్ నరేందర్ రావు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాస్ మీడియా అధికారి వెంకటేశ్వర్, సీహెచ్ఓ శ్రీ నామదేవ్, హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీ అల్లాడి శ్రీనివాస్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
