Thursday, September 3, 2026
HomeTelanganaకంటి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం: డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ నరేందర్‌ రాథోడ్‌

కంటి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం: డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ నరేందర్‌ రాథోడ్‌

నేత్రదానంపై అవగాహన.. 35 మంది విద్యార్థులకు కంటి అద్దాలు

📰 Generate e-Paper Clip

మంచిర్యాల, సెప్టెంబర్‌ 2, ( ఆంజనేయులు న్యూస్ )

నేత్రదానం పక్షోత్సవాల్లో భాగంగా మంచిర్యాల పట్టణంలోని మహాత్మా జ్యోతిబా పూలే బాలికల రెసిడెన్షియల్‌ పాఠశాలలో బుధవారం నేత్రదానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ నరేందర్‌ రాథోడ్‌, మహాత్మా జ్యోతిబా పూలే పాఠశాలల కోఆర్డినేటర్‌ అశోక్‌తో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ నరేందర్‌ రాథోడ్‌ మాట్లాడుతూ నేత్రదానం ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని సూచించారు. నేత్రదానం ద్వారా మరొకరికి చూపును ప్రసాదించే అవకాశం ఉంటుందని విద్యార్థులకు వివరించారు. కంటి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. మూడు నెలల క్రితం ఆర్‌బీఎస్‌కే, జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ పరీక్షల్లో అవసరమైన వారికి కంటి అద్దాలు అందించేందుకు జిల్లాకు 850 కంటి అద్దాలు పంపిణీకి వచ్చినట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా బుధవారం పాఠశాలలో 35 మంది విద్యార్థులకు కంటి అద్దాలను పంపిణీ చేశారు. కంటి సంబంధిత వ్యాధులు రాకుండా పౌష్టికాహారం తీసుకోవాలని, ఆకుకూరలు, పండ్లు, ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా గంటల తరబడి సెల్‌ఫోన్లు చూడటం వల్ల కంటి సమస్యలు వచ్చే అవకాశం ఉన్నందున మొబైల్‌ ఫోన్‌ వినియోగాన్ని తగ్గించాలని విద్యార్థులకు సూచించారు. కంటి అద్దాలను సక్రమంగా ఉపయోగించుకోవడం, వాటిని భద్రంగా ఉంచుకోవడంపై అవగాహన కల్పించారు. వర్షాకాలంలో వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను పాటించాలని కోరారు. నిల్వ ఉన్న ఆహార పదార్థాలను తీసుకోకుండా తాజా ఆహారాన్ని తీసుకోవాలని, పరిశుభ్రమైన మంచినీటిని మాత్రమే వినియోగించాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. పాఠశాల వంటగది, వంట పాత్రలు, తాగునీటి ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచాలని వంట సిబ్బందికి సూచించారు. కూరగాయలు, ఆహార పదార్థాలను పరిశుభ్రంగా పరిశీలించిన అనంతరం వినియోగించాలని, ప్రత్యేక వంటలు తయారు చేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌బీఎస్‌కే వైద్యులు, వైద్య సిబ్బంది, జిల్లా మాస్‌ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్‌, సీహెచ్‌వోలు శ్రీ నాందేవ్‌, కాకిరాల వెంకటేశ్వర్లు, హెల్త్‌ ఎడ్యుకేటర్‌ అల్లాడి శ్రీనివాస్‌, జిల్లా అంధత్వ నివారణ కోఆర్డినేటర్‌ శ్రీ శంకర్‌, సిబ్బంది, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.