కలెక్టర్ కె. హరిత ఆదేశాలతో చర్యలు
ఆసిఫాబాద్, ఆగస్టు 7, ( ఆంజనేయులు న్యూస్ )
ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ (టి) మండలం సిర్పూర్ (టి) గ్రామపంచాయతీలో తప్పుడు జనన ధృవీకరణ పత్రం జారీ చేసినట్లు నిర్ధారణ కావడంతో పంచాయితీ కార్యదర్శి సస్పెండ్ చేస్తూ కంప్యూటర్ ఆపరేటర్ ను విధుల నుండి తొలగించడం జరిగిందని జిల్లా కలెక్టర్ కె.హరిత శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. విచారణలో జనన మరణాల నమోదు చట్టం, 1969 నిబంధనలను ఉల్లంఘిస్తూ గ్రామపంచాయతీ కార్యదర్శి షైనీ తిరుపతి విధి నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించినట్లు నిర్ధారణ అయిందని, విచారణ నివేదిక ప్రకారం, సంబంధిత వ్యక్తి పొన్నం శ్రీనిధి కి సంబంధించిన జనన తేదీ రిజిస్టర్‌లో నమోదు లేకపోవడం, దరఖాస్తు స్వీకరించకపోవడం, అవసరమైన ఎటువంటి ఆధార పత్రాలను పరిశీలించకపోవడం జరిగినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా నేరుగా యూనిఫైడ్ బర్త్ అండ్ డెత్ పోర్టల్‌లో వివరాలు నమోదు చేసి జనన ధృవీకరణ పత్రాన్ని జారీ చేసినట్లు విచారణలో తేలిందని వివరించారు. విధి నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం, అధికార దుర్వినియోగం, ప్రభుత్వ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిన పంచాయతీ కార్యదర్శి షైనీ తిరుపతిని తక్షణమే సస్పెండ్ చేస్తూ, తదుపరి శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగిందని తెలిపారు. తప్పుడు నమోదు ప్రక్రియలో బాధ్యత వహించిన కంప్యూటర్ ఆపరేటర్ నీలేష్‌ను విధుల నుండి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యం, నిబంధనల ఉల్లంఘన, తప్పుడు ధృవీకరణ పత్రాల జారీ వంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, గ్రామపంచాయతీలలో ప్రజలకు అందించే సేవలు పూర్తిగా పారదర్శకంగా, చట్టబద్ధంగా ఉండాలని, ప్రతి దరఖాస్తును సంబంధిత ఆధారాలు, రికార్డులను సమగ్రంగా పరిశీలించిన అనంతరమే పరిష్కరించాలని తెలిపారు.
