జూన్ 1 నుంచి స్టాప్ డయేరియా కార్యక్రమం ప్రారంభం
జీరో చిన్నారుల మరణాలే లక్ష్యం: డీఎంహెచ్వో డాక్టర్ ఎస్. అనిత

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లాలో అతిసార వ్యాధి నివారణకు వైద్య ఆరోగ్యశాఖ విస్తృత చర్యలు చేపట్టింది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్. అనిత ఆధ్వర్యంలో సోమవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో “స్టాప్ డయేరియా” కార్యక్రమంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జూన్ 1 నుంచి 15వ తేదీ వరకు మొదటి దశలో జిల్లావ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే జూన్ 16 నుంచి జూలై 31 వరకు రెండో దశలో ప్రతి గ్రామంలో ఓఆర్ఎస్, జింక్ డిపోలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రతి ఆశా ఆరోగ్య కార్యకర్త ఇంటింటికి తిరిగి ఐదు సంవత్సరాల లోపు పిల్లలను గుర్తించి, ప్రతి ఇంటిలో ఓఆర్ఎస్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ ఏడాది చిన్నపిల్లల మరణాలు జీరో స్థాయిలో ఉండేలా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. డయేరియా బారిన పడకుండా తల్లులు, గర్భిణీలు, ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి అంగన్వాడీ, ఆశా కార్యకర్తల వద్ద ఓఆర్ఎస్, జింక్ అందుబాటులో ఉండాలని తెలిపారు. జాతీయ టీకాల కార్యక్రమంలో భాగంగా రోటా వైరస్ టీకాను ప్రతి చిన్నారికి అందించాలని ఆదేశించారు. అతిసారం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గిపోతుందని, వెంటనే ఓఆర్ఎస్ ద్రావణం ఇవ్వాలని సూచించారు. ఓఆర్ఎస్ తయారీ విధానంపై ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడం, సురక్షితమైన తాగునీరు వినియోగించడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. మొదటి ఆరు నెలలు తప్పనిసరిగా తల్లిపాలు ఇవ్వాలని, పిల్లలకు పోషకాహారం అందించాలని, మరుగుదొడ్ల వినియోగాన్ని అలవాటు చేయాలని సూచించారు. రోటా వైరస్ టీకాలు, విటమిన్-ఏ సిరప్ వేయించడం ద్వారా అతిసార వ్యాధిని నివారించవచ్చని పేర్కొన్నారు. ప్రతి విరోచనం తర్వాత ఓఆర్ఎస్ ద్రావణం ఇవ్వడం ద్వారా చిన్నారులను రక్షించవచ్చన్నారు.
ముఖ్యంగా మారుమూల గిరిజన ప్రాంతాలు, స్లమ్ ఏరియాలు, వలస జనాభా అధికంగా ఉన్న ప్రాంతాలు, అనాథ ఆశ్రమాలపై వైద్యులు, ఆరోగ్య సిబ్బంది ప్రత్యేక దృష్టి పెట్టాలని డీఎంహెచ్వో ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ప్రసాద్, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, డిపిఓ ప్రశాంతి, సుమన్, వసుమతి, రాజేష్, నీలిమ, దిశా కోఆర్డినేటర్, సావిత్రి తదితర ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
