ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా వైద్య సేవలు

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లా కలెక్టర్ ఆదేశానుసారము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా శనివారం భీమిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్పెషలిస్ట్ వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక సర్పంచ్ శ్రీకాంత్ గౌడ్ మరియు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్. అనిత ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న స్పెషలిస్ట్ వైద్యులచే వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలు ఈ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా మాతా-శిశు సంరక్షణ సేవలు, చిన్న పిల్లలకు టీకాలు, తల్లి-బిడ్డల ఆరోగ్య సేవలు, కంటి నిపుణులచే చికిత్సలు, జనరల్ ఫిజీషియన్ సేవలు, ఆర్థోపెడిక్, డెంటల్ వంటి స్పెషలిస్ట్ వైద్య సేవలను అందిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని 30 సంవత్సరాలు పైబడిన వారిలో అసంక్రమణ వ్యాధులను గుర్తించేందుకు పరీక్షలు నిర్వహించడం, రోగులను గుర్తించి మందులు అందించడం, అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నట్లు తెలిపారు. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు, జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు, కీటక జనిత వ్యాధులైన మలేరియా, డెంగ్యూ, చికెన్ గునియా వంటి వ్యాధులు ప్రబలకుండా గ్రామపంచాయతీ సెక్రెటరీలు, సర్పంచ్‌ల సహకారంతో దోమల నివారణ చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. అలాగే మానసిక ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, టీబీ వ్యాధిగ్రస్తులను గుర్తించి చికిత్సలు అందించడం, పౌష్టికాహారం కోసం కిట్లను అందజేయడం జరుగుతున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రత్యేక వైద్య నిపుణులు డాక్టర్ రష్మీ, డాక్టర్ సౌజన్య, డాక్టర్ రావు రవళి, డాక్టర్ తారక్, డాక్టర్ రఫీ, డాక్టర్ షబ్బీర్ అహ్మద్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ నిర్మల, డిపిఓ ప్రశాంతి, డిపిహెచ్‌ఎన్ ఆర్‌ఎస్ పద్మ, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, సిహెచ్‌ఓ జలపతి, ఉమాశంకర్, ఆరోగ్య ఆశ కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాలు, ఐకెపి బృందాలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ప్రజల నుండి మంచి స్పందన లభిస్తున్నదని, వ్యాధులను త్వరగా గుర్తించి నిపుణులచే గ్రామాలకే చికిత్సలు అందించడం జరుగుతోందని తెలిపారు.
