• వెంటాడుతున్న నిధులు కొరత

సాసర్ పీట్ లో నీరు తాగుతున్న వన్యప్రాణులు (పాతచిత్రం)
ఆంజనేయులు న్యూస్, ఆదిలాబాద్ జిల్లా: ఈ ఏడాది ఫిబ్రవరిలోనే వేసవి తాపం పెరిగిపోయింది. గతేడాది కంటే ఈ సారి ఎండలు తీక్షణంగా ఉంటాయని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. గ్రామాలు, పట్టణాల్లో ఏదో ఒక రకంగా తాగు నీరు లభించే అవకాశాలుంటాయి. కానీ అడవుల్లో ఆ వెసులుబాటు ఉండదు. ఉన్న వాగులు, వంకలు, ఇతర నీటి వనరులు తీవ్ర ఎండలతో పూర్తిగా అడుగంటిపోతాయి. వన్యప్రాణులు నీటి జాడ కోసం వెంపర్లాడుతుంటాయి. అడవిలో దాహం తీర్చుకునే వెసులుబాటు లేకపోతే గ్రామ పొలిమేరల్లోకి వచ్చేస్తాయి. అలా వస్తే కొందరు వాటిని వేటాడి చంపే ప్రమాదాలుంటాయి. అలా జరగకుండా వాటి దాహం తీర్చటానికి అటవీ శాఖనే తాగు నీటి వ్యవస్థను అడవుల్లో ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇది వరకే అడవుల్లో వేసిన బోర్లను, సాసర్ పీట్ లను మరమ్మతులు చేయించాలి. లేదా ట్రాక్టర్లు/ఎడ్ల బండ్ల ద్వారా ఆ సాసర్ పీట్లలో నీటిని నింపాల్సి ఉంటుంది. కానీ ఇందుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు విడుదల కాకపోవటంతో వన్యప్రాణుల దాహం తీరే మార్గం ప్రశ్నార్థకంగా మారింది. జిల్లాలో వన్యప్రాణుల దాహం తీర్చటానికి అటవీ శాఖ దట్టమైన అటవీ ప్రాంతాల్లో మూడు వందల వరకు సాసర్ పిట్లను నిర్మించింది. సాసర్పాట్ల వద్ద కొన్ని చోట్ల సోలార్ పంపుసెట్లతో బోర్ల నుంచి నీళ్లను నింపే వ్యవస్థ ఉండగా మరికొన్ని చోట్ల ఎడ్లబండ్లు/ట్రాక్టర్ల ద్వారా నీటిని సరఫరా చేసేవారు. వాటిని మరమ్మతులు చేయించటానికి గతేడాది రూ.11.21 లక్షల అంచనా వ్యయంతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా ఒక్క పైసా విడుదల కాలేదు. జిల్లా పాలనాధికారి ప్రత్యేక అభివృద్ధి నిధుల నుంచి రూ.20 లక్షలు కేటాయించగా ఆ నిధులతో ఎలాగోలా సాసర్పిట్లు మరమ్మతులు చేయించి అడవి జంతువుల దాహం తీర్చారు. ఈ ఏడాది సైతం వన్య ప్రాణుల దాహం తీర్చటానికి నిధులు విడుదల కాలేదు.
• ఎస్.డి.ఎఫ్ నిధులకు ప్రయత్నిస్తున్నాం..
వన్యప్రాణుల దాహం తీర్చటానికి కంపా నిధులు గతేడాది కూడా విడుదల కాలేదు. గత సంవత్సరం ఎస్.డి.ఎఫ్ నిధులను జిల్లా పాలనాధికారి విడుదల చేయటంతో అవసరమైన చర్యలు తీసుకున్నాం. ఈ ఏడాది సైతం ఎస్డీఎఫ్ నిధుల కోసం ప్రయత్నిస్తున్నాం.
-ప్రశాంత్ బాజీరావు పాటిల్, డీఎఫ్ఓ


