Telugu Updates
Logo
mobile after logo

గ్రామీణ వైద్యులు తమ పరిమితికి మించి వైద్య సేవలు అందించకూడదు 

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. జి. సి. సుబ్బారాయుడు

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లాలోని గ్రామీణ వైద్యులు (ఆర్. ఎం. పి. & పి. ఎం. పి.) తమ పరిమితికి మించి వైద్య సేవలు అందించకూడదని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. జి. సి. సుబ్బారాయుడు అన్నారు. శనివారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అందిస్తున్న సేవలు, గ్రామీణ వైద్యులు అందించవలసిన సేవలపై జిల్లాలోని ఆర్. ఎం. పి. & పి. ఎం. పి. లతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మాట్లాడుతూ.. గ్రామీణ వైద్యులు తమ పరిధిలో వైద్య సేవలు అందించాలని, పరిమితికి మించిన వైద్యం చేయకూడదని తెలిపారు. గ్రామీణ వైద్యులు వైద్యం అందిస్తున్న కేంద్రంపై ప్రథమ చికిత్స కేంద్రం అని ఉండాలని, ఈ ప్రథమ చికిత్స కేంద్రంలో పడకలు ఉండకూడదని, ఎలాంటి నమూనా మందులు ఉండకూడదని, ఎలాంటి యాంటిబయాటిక్స్ వినియోగించకూడదని తెలిపారు. వేసవి ఉష్ణోగ్రత కారణంగా వడదెబ్బకు గురైన బాధితులకు ప్రథమ చికిత్స అందించి సమీప ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. వడదెబ్బకు గురికాకుండా తీసుకోవలసిన చర్యలు, వడదెబ్బ బాధితులు పాటించవలసిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, అత్యవసర సేవల నిమిత్తం 108 అంబులెన్స్ లను వినియోగించి ప్రభుత్వ ఆసుపత్రులకు మాత్రమే తరలించాలని, ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు తెలియజేయాలని తెలిపారు. వైద్యులు నిబంధనలు ఉల్లంఘించినట్లయితే క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వైద్యులు శివప్రతాప్, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్లు, తెలంగాణ ఆర్. ఎం. పి., పి. ఎం. పి. సంక్షేమ సంఘం, అనుభవ వైద్య సంఘం ప్రతినిధులు, జిల్లాలోని 18 మండలాల నుండి మారుమూల ప్రాంతాలలో పని చేస్తున్న 285 మంది గ్రామీణ వైద్యులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Post bottom