ఎట్టకేలకు ప్రీతి మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించించారు. మరోవైపు ప్రీతి కుటుంబానికి ప్రభుత్వం రూ.10 లక్షలు, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రూ.20 లక్షలు పరిహారం ప్రకటించినట్లు ఆమె తండ్రి తెలిపారు.
ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: ఆత్మహత్యాయత్నం చేసిన పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఐదురోజుల పాటు మృత్యువుతో పోరాడి నిమ్స్ ఆసుపత్రిలో మృతిచెందింది. దీంతో నిమ్స్ ఆసుపత్రిలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ప్రీతి మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం నిమ్స్ నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించేందుకు అధికారులు యత్నించగా ఆమె తల్లిదండ్రులు తొలుత నిరాకరించారు. ప్రీతి మృతిచెందడానికి గల కారణాలు తెలపాలని డిమాండ్ చేశారు. ప్రీతికి ఇంజక్షన్ ఇచ్చారని ఆరోపించారు. ఈ నెల 22 ఉదయం 4 గంటల నుంచి 8 గంటల వరకు ఏం జరిగిందో చెప్పాలని పట్టుబట్టారు. సీనియర్ విద్యార్థిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మరోవైపు ప్రీతి తల్లిదండ్రులతో పోలీసులు మాట్లాడారు. దీంతో ప్రీతి మృతదేహాన్ని శవపరీక్షకు తరలించేందుకు వారు ఒప్పుకోవడంతో గాంధీకి తరలించారు. అయితే గాంధీ ఆసుపత్రిలోకి వెళ్లకుండా ప్రీతి బంధువులను పోలీసులు అడ్డుకున్నారు. శవపరీక్షకు తమను అనుమతించాలని వారు డిమాండ్ చేశారు. శవపరీక్ష పూర్తి అయిన అనంతరం పోలీసు భద్రత మధ్య కుటుంబ సభ్యులకు ప్రీతి మృతదేహాన్ని అప్పగించారు. అనంతరం ప్రీతి మృతదేహాన్ని స్వగ్రామం జనగామ జిల్లా కొడకండ్ల మండలం గిర్ని తండాకు చేర్చారు. మృతదేహం వద్ద ప్రీతి కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు.
• ప్రీతి కుటుంబానికి రూ.30 లక్షల పరిహారం: మంత్రి హామీ..
ప్రీతి కుటుంబానికి రూ. 30 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. ప్రభుత్వం రూ.10 లక్షలు, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రూ.20 లక్షలు పరిహారం ప్రకటించినట్లు ప్రీతి తండ్రి తెలిపారు. కుటుంబంలో ఒకరికి గెజిటెడ్ ఉద్యోగం ఇవ్వనున్నట్లు మంత్రి హామీ ఇచ్చారన్నారు. పంచాయతీరాజ్ శాఖలో ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని, అంతేకాకుండా సిట్టింగ్ జడ్జితో విచారణ చేపిస్తానని మంత్రి చెప్పినట్లు ప్రీతి తండ్రి పేర్కొన్నారు. హెచ్ఓడి, ప్రిన్సిపల్ పై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. మంత్రి హరీశ్ రావు సైతం హామీ ఇచ్చారని చెప్పారు.


