Telugu Updates
Logo
mobile after logo

పుట్టగొడుగుల్లా.. అక్రమ వెంచర్లు!

ఆసిఫాబాద్ మండలంలోని చిర్రకుంట వెళ్లే మార్గంలో వ్యవసాయ భూమిలో నాలుగు ఎకరాల్లో వెంచర్ వెలిసింది. రహదారి పక్కనే ఈ ప్లాట్లు ఉండడంతో అమ్మకాలు జోరందుకున్నాయి.

సాగు భూములు, ఏజెన్సీ ప్రాంతాల్లోనే అధికం..

ఆంజనేయులు న్యూస్, ఆసిఫాబాద్ జిల్లా: పంటలు పండే సాగు భూములను, క్రయ విక్రయాలకు వీల్లేని ఏజెన్సీ ప్రాంతాల్లో భారీగా వెంచర్లు వెలుస్తున్నా.. సంబంధిత అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. పైసా పైసా కూడబెట్టి ఇంటి స్థలాన్ని కొనుగోలు చేసిన వారు మోసపోతున్నారు. బీడీపీపీ, ఇనాం భూములు, అసైన్డ్ భూములు ప్లాట్లుగా రూపాంతరం చెందుతున్నా.. రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు. డీటీసీపీ, పంచాయతీ అనుమతులు లేకుండా వెలిసిన వెంచర్లలో కొనుగోలు చేసిన స్థలాల్లో ప్రజలు ఇళ్లు కట్టుకోవడానికి నానా పాట్లు పడుతున్నారు. కొన్ని చోట్ల పంచాయతీ అధికారులు ఇంటి నంబర్లు ఇవ్వడంతో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. జిల్లాలోని అన్ని మండలాల్లో ఏజెన్సీ ప్రాంతం విస్తరించి ఉంది. బీడీపీపీ (బిలా దాఖల పోరంబోకు), అసైన్డ్ భూములే జిల్లా కేంద్రానికి అయిదు కిలోమీటర్ల దూరంలో 800 ఎకరాలకు పైగా ఉన్నాయి. వీటిలో చాలా వరకు కబ్జాకు గురై వెంచర్లుగా రూపాంతరం చెందుతున్నాయి. మధ్యలో ఉండే కాలువలు, నాలాలను కబ్జా చేసేస్తున్నారు. వ్యవసాయ భూములకు నాలా అనుమతులు తీసుకోకుండానే వెంచర్లు వేస్తున్నారు. వీటికి అవసరమయ్యే మొరం సైతం ప్రభుత్వ భూముల నుంచి అక్రమంగా తీసుకువచ్చి రోడ్లు వేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 150 వరకు వెంచర్లు ఉండగా.. 14 మాత్రమే డీటీసీపీ అనుమతులు ఉండడం గమనార్హం.

Post bottom