Telugu Updates
Logo
mobile after logo

పంచాంగం’ పేరిట దోపిడి – సంపాదించిన డబ్బుతో మందు, రోడ్డుపై నిద్ర

పోలీస్ స్టేషన్ ఎదుటే జ్యోతిష్య ముసుగులో మోసం – నమ్మితే నష్టమే!

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మంచిర్యాల పట్టణంలోని పోలీస్ స్టేషన్ ఎదుట చెట్టు కింద కూర్చొని పంచాంగాలు చెబుతానంటూ అమాయక ప్రజలను మోసం చేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. జ్యోతిష్యుడిగా నటిస్తూ అక్కడికి వచ్చే వారిని, ముఖ్యంగా పల్లెటూరి ప్రజలను నమ్మబలికి డబ్బులు దండుకుంటున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. స్థానికుల కథనం ప్రకారం, ఈ వ్యక్తి రోజూ భవిష్యత్తు చెబుతానంటూ పలకరిస్తూ డబ్బులు తీసుకుంటూ ఉంటాడు. అయితే ఆ డబ్బును జీవనోపాధి కోసం కాకుండా మద్యం సేవించేందుకు వినియోగిస్తున్నాడని, మందు తాగిన తర్వాత అదే చెట్టు కింద పడుకుంటున్నాడని చెబుతున్నారు. దీంతో అక్కడి పరిసరాలు అసౌకర్యంగా మారి, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి చర్యల వల్ల పోలీస్ స్టేషన్ ముందు రాకపోకలకు అంతరాయం కలుగుతూ ట్రాఫిక్ సమస్యలు కూడా తలెత్తుతున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. పైగా మూఢనమ్మకాల పేరుతో అమాయక ప్రజలను మోసం చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా, మూఢనమ్మకాల మాయలో పడకూడదని, పంచాంగం పేరుతో భయపెట్టి డబ్బులు దండుకునే వారిని నమ్మొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. శాస్త్రీయ దృక్పథంతో ఆలోచించి ఇలాంటి మోసాల నుంచి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత పోలీసులు, అధికారులు స్పందించి ఆ వ్యక్తి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడో పూర్తి వివరాలు తెలుసుకొని. ఆ వ్యక్తిని అక్కడి నుంచి తొలగించి తగిన చర్యలు తీసుకోవాలని, మూఢనమ్మకాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు..

Post bottom