
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల నిర్దేశిక లక్ష్యాలను పూర్తిస్థాయిలో సాధించేలా సమిష్టిగా కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. గురువారం హైదరాబాద్ నుండి రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంబంధిత అధికారులతో కంటి వెలుగు, పోడు భూములు, 58, 59, 76, 118 ప్రభుత్వ జి.ఓ. ల ప్రకారం చేయవలసిన క్రమబద్దీకరణ, తెలంగాణకు హరితహారం, రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల పరిధిలో చేపట్టిన కంటి వెలుగు 2వ విడత కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాల నిర్వహణ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, రానున్న వేసవి కాలం దృష్ట్యా శిబిరాలకు హాజరయ్యే ప్రజల కోసం త్రాగునీరు, ఓ. ఆర్. ఎస్. ప్యాకెట్లను అందుబాటులో ఉంచడంతో పాటు కూర్చునేందుకు నీడ ఏర్పాట్లు చేయాలని తెలిపారు. శిబిరాలకు హాజరైన ప్రజలకు పరీక్షలు నిర్వహించిన అనంతరం ఫలితాల ఆధారంగా ప్రిస్క్రిప్షన్ అద్దాలను పంపిణీ చేయడం జరుగుతుందని, సదరు లబ్ధిదారులకు అద్దాలను అందించిన తర్వాత వారికి ఫోటో వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయాలని తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన పేదవారికి గూడు కల్పించాలని ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన రెండు పడక గదుల ఇండ్ల పథకంలో భాగంగా రాష్ట్రంలో జి5.హెచ్.ఎం.సి. మినహాయించి పట్టణ ప్రాంతాలలో నిర్మించిన 42 వేలకు పైగా రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణాల లబ్ధిదారులను కేటాయింపు చేయవలసి ఉండగా, ఇప్పటి వరకు 6 వేల 620 మాత్రమే జరిగిందని, ఫిబ్రవరి 26 నాటికి పెండింగ్ లో ఉన్న ఇండ్ల లబ్దిదారుల ఎంపిక పూర్తి చేసి వివరాలు ఆన్ లైన్ లో అప్ లోడ్ చేయడంతో పాటు నిర్ణీత ఫ్రోఫార్మా 1 ప్రకారం అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమాచారం త్వరితగతిన అందించాలని, అధికారులు వారి వద్ద ఉన్న సమాచారం మేరకు నివేదిక తయారు చేసి అందించాలని అధికారులను ఆదేశించారు. ఆర్. ఓ. ఎఫ్. ఆర్. చట్టం -2005 ప్రకారం ఏండ్లుగా పోడు వ్యవసాయం సాగు చేసుకుంటున్న గిరిజనుల కోసం ప్రభుత్వం చేపట్టిన పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమం కొరకు జిల్లా స్థాయి కమిటీ వద్ద పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు పరిశీలించి త్వరగా ఆమోదించాలని, జిల్లాలో ఆమోదించిన దరఖాస్తులో పట్టాదారు ఫోటో, ఇతర వివరాలు పాలిగాన్ చెక్ చేసి, సరిగ్గా ఉన్న దరఖాస్తులను వెంటనే పట్టా పాస్ పుస్తకాల ముద్రణకు పంపాలని తెలిపారు. భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణం అందించడం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా వచ్చే సంవత్సరంలో అవసరమైన మొక్కల పెంపకం నర్సరీలో పూర్తి చేయాలని, జిల్లాలో మొక్కలు నాటే స్థలాల గుర్తింపు, రిజిస్ట్రేషన్ వంటి అంశాలు పక్కాగా జరిగేలా ప్రణాళిక సిద్ధం చేయాలని, వేసవిని దృష్టిలో పెట్టుకొని మొక్కల సంరక్షణ అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా జి.ఓ. నం. 58 ప్రకారం ఆమోదించిన దరఖాస్తుదారుల పట్టాలను స్థానిక మంత్రి, ప్రజాప్రతినిధులు ఆధ్వర్యంలో పంపిణీ పూర్తి చేయాలని, పెండింగ్ దరఖాస్తుల ధృవీకరణ పూర్తి చేయాలని, ఈ మేరకు క్షేత్రస్థాయి పరిశీలన 100 శాతం పూర్తి చేయాలని అన్నారు.
జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ మాట్లాడుతూ. కంటి వెలుగు 2వ విడత కార్యక్రమం నిర్వహణ కోసం 40 బృందాలను నియమించి జిల్లా వ్యాప్తంగా 40 కంటి వెలుగు శిబిరాల ద్వారా ప్రజలకు సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ శిబిరాలలో పరీక్షలు నిర్వహించిన అనంతరం ప్రిస్క్రిప్షన్ అద్దాలు అవసరం ఉన్న వారి కోసం చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రెండు పడక గదుల ఇండ్ల పథకంలో భాగంగా జిల్లాలో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, నిర్మాణాలు పూర్తయిన ఇండ్ల పంపిణీ కొరకు లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి క్షేత్రస్థాయి పరిశీలన కొరకు ఎఫ్. ఆర్. సి. కమిటీ సమన్వయంతో రెవెన్యూ, అటవీ శాఖ అధికారులతో కలిసి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లాకు కేటాయించిన లక్ష్యాలను సాధించేందుకు మొక్కలను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. రాహుల్, జిల్లా అటవీ అధికారి శివ ఆశిష్ సింగ్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. జి.సి. సుబ్బారాయుడు, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి బి. శేషాద్రి, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.


