
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: రివిలేషన్ పాఠశాలలో ముందస్తుగా బతుకమ్మ పండుగ సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. విద్యార్థినీ విద్యార్థులకు బతుకమ్మ పండుగ యొక్క విశిష్టతను తెలియజేయడానికి ముందస్తుగా పాఠశాలలో బతుకమ్మ పండుగ సంబరాలు జరుపుకుంటున్నామని,తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచేదే ఈ బతుకమ్మ పండుగ అని పాఠశాల కరస్పాండెంట్ రాపోలు విష్ణువర్ధన్ రావు తెలిపారు. బంధాలను అనుబంధాలను గుర్తు చేస్తూ, ప్రకృతిని ఆరాధిస్తూ, తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని చాటి చెప్పే పండుగ బతుకమ్మ పండుగ అని, ఇదో పూల పండుగ అని, ప్రకృతిని పూజించే పండుగ అని, తొమ్మిది రోజులు ఆడి పాడి అత్యంత భక్తిశ్రద్ధలతో గౌరీదేవిని పూజించే తెలంగాణకే ప్రత్యేకమైన పూల సంబరం ఈ బతుకమ్మ పండుగ అని పాఠశాల కరస్పాండెంట్ రాపోలు విష్ణువర్ధన్ రావు తెలిపారు.
పాఠశాల ఉపాధ్యాయురాలు సునీత మాట్లాడుతూ ఆశ్వయుజ అమావాస్యనాడు ఎంగిలిపూల బతుకమ్మగా ప్రారంభమయ్యే సంబరాలు తొమ్మిది రోజులపాటు సాగి సద్దుల బతుకమ్మ రోజు గౌరమ్మను సాగనంపడంతో ముగుస్తాయని, ఈ తొమ్మిది రోజులు పాటు మహిళలు చేసే హడావుడి అంతా ఇంతా కాదని, ప్రకృతిలో లభించే ప్రతి పువ్వు ఏరి కోరి తెచ్చి రంగురంగుల పూలతో బతకమ్మలను పేర్చి నిత్యం గౌరీదేవిని తమ ఆటపాటలతో పూజిస్తారని, అందరూ కలిసి సంతోషంగా పాటలు పాడుతూ బతుకమ్మ ఆటలాడుతారని, ఒక్కరు పాడుతుంటే మిగతా వారంతా వారికి వంత పాడుతారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.



