Sunday, November 29, 2026
HomeTelanganaమంచిర్యాలలో పార్కింగ్‌కు స్థలం కరువు.. నిబంధనలకు తూట్లు!

మంచిర్యాలలో పార్కింగ్‌కు స్థలం కరువు.. నిబంధనలకు తూట్లు!

పార్కింగ్ సదుపాయాలు లేని వాణిజ్య భవనాలు, ఆసుపత్రులు.. రోడ్లపైనే వాహనాల నిలుపుదలతో ట్రాఫిక్ ఇబ్బందులు..

📰 Generate e-Paper Clip

మంచిర్యాల నవంబర్ 28, ( ఆంజనేయులు న్యూస్ )

మంచిర్యాల పట్టణంలో పెద్దపెద్ద వాణిజ్య భవనాలు, ప్రైవేట్ ఆసుపత్రులు వెలుస్తున్నప్పటికీ వాహనాల పార్కింగ్ సదుపాయాల కల్పనపై మాత్రం నిర్లక్ష్యం కనిపిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భవనాలు నిర్మించి వ్యాపారాలు నిర్వహిస్తున్న యాజమాన్యాలు పార్కింగ్ ఏర్పాట్లను పట్టించుకోకపోవడంతో వినియోగదారులు, రోగులు, వారి బంధువులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మార్కెట్ ప్రాంతంలోని వెంకటేశ్వర కాంప్లెక్స్, గిన్ని కాంప్లెక్స్‌తో పాటు ఐబీ చౌరస్తాలోని ముఖరం ప్లాజా, వంటి పెద్ద వాణిజ్య భవనాల్లో సెల్లార్లను పార్కింగ్‌కు వినియోగించకుండా ఇతర వ్యాపారాలకు అద్దెకు ఇచ్చినట్లు స్థానికంగా కనిపిస్తోంది. పార్కింగ్ కోసం కేటాయించాల్సిన స్థలాలను వ్యాపార అవసరాలకు వినియోగించడం ద్వారా అద్దె ఆదాయానికి ప్రాధాన్యత ఇస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో ఆయా భవనాలకు వచ్చే వినియోగదారులు తమ వాహనాలను రోడ్లపైనే నిలిపివేయాల్సిన పరిస్థితి నెలకొంటోంది. మరోవైపు పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ఉన్న కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ పార్కింగ్ సదుపాయం లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఐబీ చౌరస్తాలోని వసుధ ఆసుపత్రి, లక్ష్మీ చౌరస్తాలోని తిరుపతి ఆసుపత్రులకు సంబంధిత భవనాల్లో ప్రత్యేక పార్కింగ్ సదుపాయం లేదని స్థానికులు పేర్కొంటున్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన ఆసుపత్రులకు సైతం పార్కింగ్ సౌకర్యం లేకపోవడం గమనార్హం. ఆసుపత్రులకు వచ్చే రోగులు, వారి బంధువులు వాహనాలను రోడ్లపైనే నిలిపివేయాల్సి వస్తోందని, తాత్కాలికంగా వేరే ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాటు చేసుకున్నా ప్రధాన సమస్యకు పరిష్కారం లభించడం లేదని వాహనదారులు అంటున్నారు. అసలు వాణిజ్య భవనాలు, ఆసుపత్రులకు అనుమతులు ఇచ్చే సమయంలో పార్కింగ్ సదుపాయాలను అధికారులు పరిశీలించారా? భవన నిర్మాణ అనుమతుల్లో పార్కింగ్ కోసం కేటాయించిన సెల్లార్లను ఇతర వ్యాపారాలకు అద్దెకు ఇస్తుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? నిబంధనలకు విరుద్ధంగా వినియోగిస్తున్న భవనాలపై ఇప్పటివరకు ఎన్ని తనిఖీలు నిర్వహించారు? ఎన్ని నోటీసులు జారీ చేశారు? నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రధాన కూడళ్లలో ఇప్పటికే ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉండగా, పార్కింగ్ సదుపాయాలు లేని భవనాల కారణంగా సమస్య మరింత తీవ్రమవుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆసుపత్రుల వద్ద అత్యవసర సమయాల్లో అంబులెన్స్‌లు, ఇతర వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్, టౌన్ ప్లానింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి వాణిజ్య భవనాలు, ప్రైవేట్ ఆసుపత్రుల్లో పార్కింగ్ ఏర్పాట్లపై సమగ్ర విచారణ చేపట్టాలని, నిబంధనల ఉల్లంఘనలు ఉంటే చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు..

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.