ఆంజనేయప్రసాద్ హాస్పిటల్ గల్లీలో ట్రాఫిక్ ఇక్కట్లు.. అధికారుల నిర్లక్ష్యంపై కాలనీవాసుల ఆవేదన!
మంచిర్యాల నవంబర్ 26, ( ఆంజనేయులు న్యూస్ )
మంచిర్యాల పట్టణంలోని ఐబీ ఏరియా ఆంజనేయప్రసాద్ హాస్పిటల్ లైన్‌లో ట్రాఫిక్ సమస్య కాలనీవాసులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. గత 40 ఏళ్లుగా నివసిస్తున్న సుమారు 200కు పైగా కుటుంబాలు మూడేళ్లుగా ఈ సమస్యతో సతమతమవుతున్నాయి. ఆంజనేయప్రసాద్, బర్త్ రూట్స్ ఆసుపత్రుల వద్ద రోడ్డుపైకి విస్తరించిన షట్టర్లు, షెడ్లతో పాటు రహదారిపైనే వాహనాల పార్కింగ్ చేయడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఎదురెదురుగా వాహనాలు వచ్చినప్పుడు దారి లేక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. సమీపంలో రివల్యూషన్ స్కూల్ ఉండటంతో చిన్నారుల భద్రతపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కనీసం స్పీడ్ బ్రేకర్లు కూడా ఏర్పాటు చేయలేదని స్థానికులు చెబుతున్నారు. సమస్యపై స్థానికంగా పలుమార్లు విన్నవించినా పరిష్కారం లభించకపోవడంతో కాలనీవాసులు జిల్లా కలెక్టర్ నిర్వహించిన ప్రజావాణిలో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నట్లు స్థానికులు తెలిపారు. రోడ్డుపై ఉన్న షెడ్లను తొలగించాలని సూచించినప్పటికీ ఇప్పటివరకు క్షేత్రస్థాయిలో ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో గ్రీన్ సిటీలో చిన్న షెడ్డు విషయంలో ఫిర్యాదు అందగానే అధికారులు వెంటనే స్పందించి తొలగించారని స్థానికులు గుర్తుచేస్తున్నారు. అలాంటిది ఇక్కడ రోడ్డుపైకి విస్తరించిన షెడ్లు ఉన్నా, కలెక్టర్ ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఒకచోట ఫిర్యాదు అందగానే స్పందించే అధికారులు, మరోచోట కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో అధికారుల తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ట్రాఫిక్, మున్సిపల్, టౌన్ ప్లానింగ్ అధికారులు ఆంజనేయప్రసాద్ హాస్పిటల్ గల్లీలో సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి రోడ్డుపై ఉన్న షెడ్లను తొలగించాలని, రహదారిపై వాహనాల పార్కింగ్‌ను నియంత్రించి గల్లీని పార్కింగ్ రహిత ప్రాంతంగా మార్చాలని కాలనీవాసులు కోరుతున్నారు. చిన్నారుల భద్రత దృష్ట్యా స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
