Monday, October 26, 2026
HomeTelanganaమంచిర్యాలలో అభివృద్ధి పనులా.. వ్యాపారుల పాలిట శాపాలా?

మంచిర్యాలలో అభివృద్ధి పనులా.. వ్యాపారుల పాలిట శాపాలా?

రోడ్డు వెడల్పు, డ్రైనేజీ పనులతో మార్కెట్‌ వ్యాపారుల విలవిల

📰 Generate e-Paper Clip

మంచిర్యాల మార్కెట్‌లో అసంపూర్తి పనులతో వ్యాపారులకు తిప్పలు.!

మంచిర్యాల, అక్టోబర్ 26, ( ఆంజనేయులు న్యూస్ )

మంచిర్యాల మార్కెట్‌ ప్రాంతంలో చేపడుతున్న రోడ్డు వెడల్పు, డ్రైనేజీ పనులు వ్యాపారులకు ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. అభివృద్ధి పనులను ఎవరూ వ్యతిరేకించడం లేదు.. కానీ పనుల పేరుతో దుకాణాల ముందు తవ్వకాలు జరిపి రోజుల తరబడి అసంపూర్తిగా వదిలేస్తే తమ వ్యాపారాలు ఎలా సాగించాలని చిరు వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. పనుల్లో జాప్యం కారణంగా వినియోగదారులు దుకాణాల వద్దకు రావడం తగ్గి, రోజువారీ ఆదాయం కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్‌ ప్రాంతంలో పలుచోట్ల రోడ్డు వెడల్పు, డ్రైనేజీ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో రాకపోకలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ముఖ్యంగా పాన్‌ డబ్బాలు, టీ దుకాణాలు, చిన్నచిన్న వ్యాపారాలు నిర్వహించే వారికి రోజువారీ సంపాదనే జీవనాధారం కావడంతో పనుల జాప్యం తమ కుటుంబ పోషణపై ప్రభావం చూపుతోందని వాపోతున్నారు. మంచిర్యాల ఫారెస్ట్‌ ఆఫీస్‌ రోడ్డులో హోటల్‌ రతన్‌లాల్‌ పక్కన పాన్‌ డబ్బా నిర్వహిస్తున్న మధు రేన్వ తన దుకాణం ముందు తవ్వకాలు చేపట్టి పది రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు పనులు కొనసాగించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత కాంట్రాక్టర్‌కు ఫోన్‌ చేసి సమస్యను వివరించినప్పటికీ పట్టించుకోవడం లేదని తెలిపారు. దుకాణం ముందు పనులు అసంపూర్తిగా ఉండటంతో వ్యాపారం చేసుకోవడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోయారు. ఒక చిరు వ్యాపారికి ఎదురైన ఈ పరిస్థితి మార్కెట్‌ ప్రాంతంలోని ఇతర వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలకు అద్దం పడుతోంది. అభివృద్ధి పనులు చేపట్టే ముందు వ్యాపారులకు కలిగే ఇబ్బందులను పరిగణనలోకి తీసుకొని, పనులను దశలవారీగా త్వరగా పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు. సంబంధిత అధికారులు పనుల పురోగతిని పర్యవేక్షించి, కాంట్రాక్టర్లతో నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేయించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మార్కెట్‌ వ్యాపారుల ఇబ్బందులపై స్థానిక ఎమ్మెల్యే, మున్సిపల్‌ అధికారులు స్పందించి, అసంపూర్తిగా ఉన్న పనులను త్వరగా పూర్తి చేయడంతోపాటు దుకాణాలకు వెళ్లే మార్గాలను అందుబాటులో ఉంచాలని వ్యాపారులు కోరుతున్నారు. అభివృద్ధి కావాలి.. వ్యాపారుల బతుకులు బలికాకూడదు.! నగర అభివృద్ధి ప్రజలకు సౌకర్యాలు కల్పించాలి తప్ప, చిరు వ్యాపారుల జీవనోపాధికి ఆటంకంగా మారకూడదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పనులను వేగవంతం చేసి, మార్కెట్‌ ప్రాంతంలో వ్యాపారాలు సజావుగా సాగేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.