Wednesday, September 23, 2026
HomeTelanganaటీబీ రోగులకు పోషకాహార కిట్లు అందజేత: డీఎంహెచ్‌ఓ డా. నరేందర్ రాథోడ్

టీబీ రోగులకు పోషకాహార కిట్లు అందజేత: డీఎంహెచ్‌ఓ డా. నరేందర్ రాథోడ్

సకాలంలో గుర్తించి, క్రమం తప్పకుండా మందులు తీసుకుంటే టీబీని పూర్తిగా నయం చేయవచ్చు

📰 Generate e-Paper Clip

మంచిర్యాల సెప్టెంబర్ 22, ( ఆంజనేయులు న్యూస్ )

టిబీ ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా మంచిర్యాల జిల్లా భీమారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో క్షయ వ్యాధిగ్రస్తులకు పోషకాహార కిట్లను పంపిణీ చేశారు. సామాజిక కార్యకర్త శ్రీ చెరుకు సర్వోత్తమ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్, ఉప జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుధాకర్ నాయక్, స్థానిక సర్పంచ్ విజయలక్ష్మితో కలిసి 30 మంది క్షయ వ్యాధిగ్రస్తులకు పోషకాహార కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ మాట్లాడుతూ.. స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు క్షయ వ్యాధి నిర్మూలనకు సహకరించాలని కోరారు. సర్వోత్తమ్ రెడ్డి పిలుపు మేరకు క్షయ వ్యాధిగ్రస్తులకు పోషకాహార కిట్లు అందించడం అభినందనీయమన్నారు. రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం, రాత్రిపూట చెమటలు పట్టడం, ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలోని ఆరోగ్య కేంద్రానికి వెళ్లి కఫం పరీక్ష చేయించుకోవాలని సూచించారు. వ్యాధిని సకాలంలో గుర్తించి, వైద్యుల సూచన మేరకు చికిత్స తీసుకుంటే క్షయ వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చన్నారు. జిల్లాలో క్షయ వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, మారుమూల ప్రాంతాల్లోనూ మొబైల్ ఎక్స్‌రే ద్వారా పరీక్షలు చేపడుతున్నామని తెలిపారు. ఆరు నెలల పాటు క్రమం తప్పకుండా మందులు తీసుకుంటే క్షయ వ్యాధిని పూర్తిగా నియంత్రించవచ్చన్నారు. క్షయ వ్యాధిగ్రస్తులకు పోషకాహారం అందించేందుకు స్థానిక ఎన్జీవోలు, ప్రజాప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు ముందుకు రావాలని ఆయన కోరారు. ప్రభుత్వం నిక్షయ్ పోషణ్ యోజన కింద క్షయ వ్యాధిగ్రస్తులకు ప్రతి నెలా రూ.1,000 పోషణ భత్యం అందిస్తోందన్నారు. టిబీ నిర్ధారణ పరీక్షలు, మందులు పూర్తిగా ఉచితమని పేర్కొంటూ ప్రజలు వ్యాధిపై అవగాహన పెంచుకుని ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైద్యులు డాక్టర్ ముస్తఫా, డాక్టర్ అశోక్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రవి, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్కా వెంకటేశ్వర్, అల్లాడి శ్రీనివాస్, నామ్దేవ్, క్షయ వ్యాధి నియంత్రణ సిబ్బంది సాయిరెడ్డి, అనిల్, ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.